Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు

30 Dec, 2021 06:42 IST|Sakshi

రెండు టీకా డోసులు పూర్తయితేనే లోనికి అనుమతి

న్యూ ఇయర్‌ ఈవెంట్ల నిర్వాహకులకు సీపీ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్‌ ఈవెంట్ల నిర్వాహకులకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీటిలో పాల్గొనే వారికి కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన డిజిటల్‌ లేదా నేరుగా తెచ్చిన సర్టిఫికెట్‌ను చూసిన తర్వాతే లోపలకు అనుమతించాలంటూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను ఆయన వెల్లడించారు.  

థర్మల్‌/ఐఆర్‌ స్క్రీనింగ్‌ తర్వాత, కచ్చితంగా మాస్కు ధరించిన వారినే లోపలకు అనుమతించాలి. కార్యక్రమం జరిగే చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.  
కార్యక్రమం నిర్వహణకు 48 గంటల ముందే నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు చేయించాలి. 
బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్ధం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు.  
ఈవెంట్లతో జరిగే ప్రతి చర్యకు, కష్టనష్టాలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి. 
ఎక్సైజ్‌ విభాగం నిర్దేశించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. కపుల్స్‌ కోసం నిర్దేశించిన పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు. బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో లైవ్‌ బ్యాండ్స్‌ నిర్వహించకూడదు. 
మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ‘డిజిగ్నెటెడ్‌ డ్రైవర్‌’ విధానంపై ప్రచారం చేయాలి.
నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలి. రహదారులపై వాహనాలు ఆపేలా చేయకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్‌లు వేర్వేరుగా అవసరమైన స్థాయిలో ఉండాలి.  

జరిమానా.. జైలు 
మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే వాహన యజమానులదే బాధ్యత. మద్యం తాగి వాహనాలు  నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు అవుతాయి. ఈ విషయాలపై ప్రచారం చేపట్టారు. 

మరిన్ని వార్తలు