తల్లిదండ్రులు.. దత్త పుత్రుడు.. సొంత కొడుకు !

27 Jun, 2022 09:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కష్టపడి పెంచి పెద్ద చేసిన దత్తపుత్రుడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో అతనికి ఆదివారం లోక్‌అదాలత్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించారు.  నగరానికి చెందిన  భార్యభర్తలకు పిల్లలు కలగకపోవటంతో ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులా అప్యాయంగా చూసుకున్నారు. ప్రయోజకుడ్ని చేయాలని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చేర్చించారు. కొన్నేళ్ల తర్వాత ఆ జంటకు కుమారుడు కలిగాడు. దత్త పుత్రుడితో పాటు సొంత కొడుకును కూడా అల్లారుముద్దుగానే చూసుకున్నారు.

కాలం గడుస్తున్న కొద్దీ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు మొదలవ్వడంతో సొంత కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. ఇదే సమయంలో దత్త పుత్రుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.  పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోవటం మానేశాడు. వారింటిని ఆక్రమించేశారు. మరోవైపు సొంత కొడుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తల్లిదండ్రుల పోషణే గగనమైపోయింది. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్దచేసిన దత్త పుత్రుడ ప్రవర్తన చూసి కుంగిపోయిన వృద్ధ జంట.. అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి చొరవతో న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు.

ఆదివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్‌ కోర్టు కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి కే.మురళీమోహన్‌ సమక్షంలో వృద్ధ జంట, దత్తపుత్రుడు, ఆయన భార్య, సొంత కొడుకును పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. దత్త పుత్రుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. 

అనంతరం ఖలీల్‌ అనే వ్యక్తిపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన అప్పు వసూలు కేసును ఉభయ పార్టీలు రాజీ పద్ధతిలో పరిష్కరించుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును , తన తల్లి మరణానంతరం ఆమె కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, ఎస్‌బీఐ కొంత అప్పును మినహాయించి కొడుకుతో రాజీకి ముందుకొచ్చింది. ప్రాథమిక దశలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఉభయ పక్షాలను సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా అభినందించి వారికి అవార్డు కాపీలను అందజేశారు.  

(చదవండి:  1,518 సివిల్‌ కేసుల పరిష్కారం)

మరిన్ని వార్తలు