అయితే రిపేర్లు.. లేకుంటే చోరీలు!

28 Feb, 2022 01:50 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా మారుతున్న ఓపెన్‌ జిమ్‌లు 

నిర్వహణను పట్టించుకోని కాంట్రాక్టర్లు, మున్సిపల్‌ అధికారులు 

లైట్లు, టాయిలెట్లూ లేక ఓపెన్‌ జిమ్‌లవైపు చూడని పెద్ద వయసువారు, మహిళలు 

యంత్రాలకు రిపేర్లు చేయించి, సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్లు 

సాక్షి నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: యువతతోపాటు సాధారణ ప్రజానీకానికి వ్యాయామం పట్ల అవగాహన పెంచడం, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఓపెన్‌ జిమ్‌’లు నిరుపయోగంగా మారిపోతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా.. పరికరాలు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి.

ఉన్న పరికరాల్లో కూడా బేరింగ్స్‌లో గ్రీజు, ఆయిల్‌ వంటివి వేయకపోవడం సరిగా పనిచేయడం లేదు. ఇక కొన్నిచోట్ల పరికరాలు దొంగల పాలవుతుంటే.. ఇంకొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు ఓపెన్‌ జిమ్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. లైట్లు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతోనూ జనం ఓపెన్‌ జిమ్‌లవైపు రాని పరిస్థితి కూడా ఉంది. 

దశల వారీగా అన్ని పట్టణాల్లో.. 
వేలకు వేలు చెల్లించి ప్రైవేటు జిమ్‌లకు వెళ్లలేని వారికి ప్రయోజనం కలిగేలా రాష్ట్రం లో 2018 నుంచి ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో, తర్వాత 51 పట్టణాల్లో 307 జిమ్‌లను చేపట్టారు. అప్పటి నుంచీ దశల వారీగా.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న పార్కులు, వాకింగ్‌ ట్రాక్స్‌ ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటిలో పరికరాల ఏర్పాటు, నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీలకే అప్పగించారు. మున్సిపాలిటీలు సివిల్‌ వర్క్, టైల్స్‌ వంటివి సిద్ధం చేస్తే.. కాంట్రాక్టర్లు వ్యాయమ పరికరాలు అమర్చుతున్నారు. 

మంచి పరికరాలతో.. 
ఓపెన్‌ జిమ్‌లలో ఒక్కోచోట రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి  పరికరాలను అమర్చారు. పలుచోట్ల ఖరీదైన పరికరాలనూ ఏర్పాటు చేశారు. అబ్డామినల్‌ రైడర్, వర్టికల్‌ షోల్డర్‌ పుల్, లెగ్‌ ఎక్స్‌టెన్షన్, కర్ల్‌ మిషన్లు, షోల్డర్‌ ట్విస్టర్లు, పుల్‌ చైర్స్, చెస్ట్‌ పుష్‌ మిషన్లు వంటివి అమర్చారు. కొత్తలో యువకులతోపాటు నడి వయస్కులు, మహిళలు ఓపెన్‌ జిమ్‌లకు వచ్చినా.. తర్వాత వాటి నిర్వహణ లోపం, యంత్రాలు పాడైపోవడంతో వారిలో ఆసక్తి తగ్గిపోయింది. చాలాచోట్ల పిల్లల ఆటస్థలాలుగా ఓపెన్‌ జిమ్‌లు మారిపోయిన పరిస్థితి ఉంది. 

కాంట్రాక్టర్లే నిర్వహణ చూడాల్సి ఉన్నా.. 
జిమ్‌ పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనలను బట్టి.. పరికరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లే ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంది. పరికరాలు పాడైనా, తుప్పు పట్టినా సదరు కాంట్రాక్టరే కొత్తవి ఏర్పాటు చేయడమో, బాగు చేయడమో చేయాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఇది జరిగిన దాఖలాలు లేవు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓపెన్‌ జిమ్‌లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఓపెన్‌ జిమ్‌లను స్థానిక యువతకు గానీ, అసోసియేషన్లకు గానీ అప్పగిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా తీసుకున్న చర్యలు లేవు.

ఎక్కడ చూసినా అంతే..
నిజామాబాద్‌ పట్టణంలోని శివాజీనగర్, పాలిటెక్నిక్‌ కళాశాల, నాగారం, కంఠేశ్వర్‌ ప్రాంతాల్లో పరికరాలు దెబ్బతిన్నాయి. కామారెడ్డిలోని 5 జిమ్‌లలో నిర్వహణ లేక పరికరాలు చెడిపోతున్నాయని.. గోదాంరోడ్‌లోని జిమ్‌ రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ మూడ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఓపెన్‌ జిమ్‌ను కొన్ని రోజులుగా మున్సిపల్‌ అధికారులు మూసివేశారు. వనపర్తిలోనూ రెండు చోట్ల వృధాగా ఉన్నాయి. గద్వాల, అయిజ పట్టణాల్లోనూ ఓపెన్‌ జిమ్‌ల నిర్వహణ సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. 
మెదక్‌ జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీలో ఉన్న ఓపెన్‌ జిమ్‌ నిర్వహణ సరిగా లేదు. సంగారెడ్డి జిల్లాలోనూ చాలా చోట్ల వ్యాయామ పరికరాలు దెబ్బతిన్నాయి. 
కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేసినా.. నిర్వహణను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్‌లో ఓపెన్‌ జిమ్‌లోని వాకింగ్‌ ట్రాక్‌ దెబ్బతిన్నది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. 
నల్లగొండ జిల్లా పరిధిలోని చాలా జిమ్‌లలో పరికరాలు తుప్పుపడుతున్నాయి. దేవరకొండలోని జిమ్‌లలో రబ్బర్‌ మ్యాట్‌లు ఊడిపోయి అధ్వానంగా తయారయ్యాయి.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓపెన్‌ జిమ్‌లో పరికరాలన్నీ చోరీకాగా మిగిలిపోయిన ఇనుప స్తంభాలివి. ఇక్కడ ఎన్టీఆర్‌ మినీస్టేడియం, దివ్యనగర్‌ మినీపార్క్, మినీ ట్యాంక్‌ బండ్‌లపై లక్షలు వెచ్చించి ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ రక్షణ, పర్యవేక్షణ లేక కొద్ది నెలల్లోనే పరికరాలన్నీ ఒక్కొక్కటిగా దొంగల పాలయ్యాయి.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో హౌసింగ్‌ బోర్డు పక్కన ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ ఇది. ఇక్కడ 13 వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయగా.. ఐదు పరికరాలు పాడైపోయాయి. మరమ్మతుల కోసమని వాటిని నెల రోజుల కింద తీసుకెళ్లారు. ఇప్పటికీ తీసుకురాలేదు. ఇక జిమ్‌ కోసం ఏర్పాటు చేసిన మ్యాట్‌ సరిగా లేదు. నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాయామం చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

ఈ ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఓపెన్‌ జిమ్‌లో ఉన్న ‘త్రీ పర్సన్‌ వెయిస్ట్‌ ట్రైనర్‌’. ఒకేసారి ముగ్గురు కూర్చుని నడుమును అటూ ఇటూ తిప్పుతూ వ్యాయామం చేసే ఈ పరికరంలో సీట్లు చోరీ అయ్యాయి. అంతేకాదు ఇక్కడి స్పిన్నర్‌ వీల్, ఇతర పరికరాల్లోని భాగాలను ఎవరో ఎత్తుకెళ్లారు. మరికొన్ని పరికరాలు విరిగిపోయాయి. 

కోదాడ గాంధీపార్కులోని ఓపెన్‌ జిమ్‌లో పాడైపోయిన పరికరానికి తాళ్లు కట్టి వినియోగిస్తున్న దృశ్యమిది. ఒకవేళ తాళ్లు తెగిపోయి కిందపడితే ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అధికారులు వీటికి మరమ్మతులు చేయించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడే కాదు సూర్యాపేట జిల్లా పరిధిలోని ఇతర ఓపెన్‌జిమ్‌లలోనూ పరికరాలు పాడైపోతున్నాయని అంటున్నారు. 

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైటర్‌బస్తీలోని పంచతంత్ర పార్కు ఓపెన్‌ జిమ్‌లో వృథాగా పడి ఉన్న చెస్ట్‌ ప్రెస్సింగ్‌ పరికరం ఇది. ఇక్కడే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చాలాచోట్ల ఓపెన్‌ జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. తుప్పుపట్టి విరిగిపోయాయి. ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ యూపీహెచ్‌ కాలనీ వాక్‌వేలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. సత్తుపల్లిలో జిమ్‌ పరికరాలు తుప్పుపట్టాయి. బూడిదగడ్డ ఏరియాలోని రాజీవ్‌ పార్కు, పాల్వంచ, కొత్తగూడెంలలో ఉన్న జిమ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

పర్యవేక్షణ లేక పాడైపోతున్నాయి 
గోదావరిఖని పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌కు చాలా మంది వస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేక పరికరాలు దెబ్బతింటున్నాయి. వాకింగ్‌ ట్రాక్‌ దెబ్బతిన్నది. లైట్లు లేవు. టాయిలెట్లను శుభ్రం చేయక దుర్వాసన వెదజల్లుతున్నాయి. 

– గోపాల్‌రెడ్డి, గోదావరిఖని 

పట్టించుకునే వారేలేరు 
నల్లగొండలో భారీ ఖర్చుతో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని పట్టించుకునే వారు లేరు. జిమ్‌ పరికరాలు పాడైపోతున్నాయి. వెంటనే మరమ్మతులు చేయించాలి.     

– వీరబ్రహ్మచారి, నల్లగొండ   

మరిన్ని వార్తలు