ఆపరేషన్‌ బ్లూస్టార్‌ హీరో న్యాయపోరాటం

27 Nov, 2020 04:41 IST|Sakshi

కూతురు జీవితంపై సినిమాకు దిశ తండ్రి అభ్యంతరం

కోర్టుకెక్కిన మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది. తర్వాత దిశను దహనం చేసిన షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.

రిజర్వ్‌ ఫోర్స్‌లో సేవలు!
న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డితో ‘సాక్షి’మాట్లాడింది. 1981 నుంచి 1987 వరకు శ్రీధర్‌రెడ్డి సైన్యంలో పనిచేశారు. పంజాబ్‌ కపుర్తలాలోని 12 ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్‌ ఫోర్స్‌ కింద 12వ ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్‌ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్‌రెడ్డి వాపోయారు. ఇలాంటి మృగాల కోసమా తాను సరిహద్దులో గుండెలడ్డుపెట్టి పహారా కాసింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని ఎన్నో మృగాలకు వైద్యం చేసి ప్రాణం పోసిన తన కూతురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.  

>
మరిన్ని వార్తలు