-

బ్రేకులు పడినా.. ఆగేది లేదు...

5 Dec, 2022 01:14 IST|Sakshi
ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన తెలుపుతున్న రైతులు

రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు వేగంగా భూసేకరణ

ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో రైతుల నుంచి వ్యతిరేకత 

చెల్లించే పరిహారం వివరాలపై త్వరలో ప్రకటన 

సంగారెడ్డి, యాదాద్రి తదితర చోట్ల పోలీసు పహారా మధ్య హద్దుల గుర్తింపు సర్వే.. 28న యాదాద్రిలో ప్రజాభిప్రాయ సేకరణ.. తర్వాత సంగారెడ్డిలో.. 

సాక్షి, హైదరాబాద్‌:  రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో అలైన్‌మెంట్, పరిహారం, ఇతర అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళుతోంది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు కింద కోల్పోతున్న భూమికి బదులుగా నామమాత్రపు పరిహారం ఇస్తే ఊరుకోబోమని, భూమికి బదులు భూమినే ఇవ్వాలని రైతులు ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్‌ హియరింగ్‌) సభల్లో డిమాండ్‌ చేస్తున్నారు.

తమకు కచ్చితమైన హామీ ఇవ్వకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తుండటంపై మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాలకు సంబంధించి నిర్వహించిన రెండు సభల్లో కూడా జనం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో అర్ధంతరంగా ముగిశాయి. ఈనెల 28న యాదాద్రి జిల్లాలో, తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సభలు జరగనున్నాయి.

ఇప్పటికే యాదాద్రిలో రైతులు, భూయజమానులు ఆందోళనలు చేస్తుండటంతో.. అక్కడ జరగబోయే సభ కూడా రసాభాసగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రహదారి హద్దులు నిర్ధారించే సర్వే కోసం వచ్చిన అధికారులను సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో భూయజమానులు అడ్డుకుని, ఆందోళనకు దిగడంతో సర్వే ఆగిపోయింది.

ఈ పరిస్థితులతో ఇక ముందు పోలీసు పహారా మధ్య భూసేకరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. సంగారెడ్డి శివారులో పోలీసు భద్రత మధ్య సర్వే పూర్తిచేసి, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. ముందుకు సాగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ సభలు సరిగా జరగకున్నా ఈ ప్రక్రియ పూర్తయినట్టుగానే నమోదు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 

భూముల ధరలు భారీగా పెరగటంతో.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు విషయం దాదాపు నాలుగేళ్లుగా నానుతోంది. మూడేళ్ల క్రితమే రోడ్లు–భవనాల శాఖ ఆధ్వర్యంలో ఓ అలైన్‌మెంట్‌ రూపొందించారు. అది జనంలోకి వెళ్లింది. దానితో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీగా భూములు కొన్నారు.

తర్వాత ఆ అలైన్‌మెంటు కొంత మారి తుది అలైన్‌మెంట్‌ ఖరారైంది. అయితే ఇప్పుడా ప్రాంతాలన్నిటా భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని, లేకుంటే కోల్పోయే భూమికి సమానంగా సమీపంలోనే భూమిని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
మూడు రెట్లు పెంచి పరిహారం! 
భూములకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ధారించిన ధరనే పరిహారంగా ఇవ్వరని.. దానికి మూడు రెట్లు పెంచి పరిహారంగా ఇస్తారని అధికారులు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత మూడేళ్లలో జరిగిన భూక్రయ విక్రయ లావాదేవీల్లో ఎక్కువ ధర పలికిన భూముల సగటును గుర్తిస్తారని.. దానికి మూడు రెట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ధారించి పంపిణీ చేస్తారని అంటున్నారు. 
 
3డి నోటిఫికేషన్‌ వచ్చాక.. పరిహారం లెక్క.. 

3డి గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడ్డాక.. ప్రతి పట్టాదారు కోల్పోతున్న భూమి, అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లను లెక్కగట్టి.. ఎంత పరిహారం అందనుందో తేల్చి చెప్పనున్నారు. దానికి అంగీకరించిన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తారు. పరిహారం తీసుకోవడానికి నిరాకరించే వారి విషయంలో సంబంధిత న్యాయస్థానంతో కలిపి జాయింట్‌ ఖాతా తెరిచి అందులో సొమ్ము జమ చేస్తారు. ఈ విషయాన్ని భూయజమానికి తెలిపి భూమిని సేకరిస్తారు. యజమాని తీసుకునేంతవరకు ఆ పరిహారం జాయింట్‌ ఖాతాలో ఉంటుంది. తీసుకునే రోజునాటికి బ్యాంకు వడ్డీ జత చేసి వస్తుంది.   

మరిన్ని వార్తలు