న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు

27 Feb, 2021 14:35 IST|Sakshi
వామన్‌రావు, నాగమణి దంపతులు (ఫైల్‌)

అంతకు మించి లోతుగా విచారించట్లేదన్న ఆరోపణలు 

రాజకీయ లింకులకు ఆధారాలు లేవంటున్న పోలీసులు 

రిమాండ్‌ రిపోర్టులోనూ వ్యక్తిగత, గ్రామ కక్షలే ప్రస్తావన 

కేసును పక్కదారి పట్టిస్తున్నారని విపక్షాల మండిపాటు

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జంట హత్యలు జరిగి పది రోజులు గడిచినా పురోగతి కనిపించట్లేదని దుయ్యబడుతున్నాయి. పోలీసులు మాత్రం తమకు లభించిన ఆధారాల మేరకే దర్యాప్తు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గొడవలు, వ్యక్తిగత కక్షలే హత్యలకు కారణమనే కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కోణం బహిర్గతం కాలేదని పోలీసులు చెబుతున్నారు. జెడ్పీ చైర్మన్‌ మేనల్లుడు బిట్టు శ్రీను హత్యకు సహకరించినా.. అది వ్యక్తిగత వైరంతోనే అని పోలీసులు చెబుతున్నారు. కాగా, భవిష్యత్తులో కేసును సీబీఐకి లేదా సిట్‌కు బదిలీ చేసినా, తమ దర్యాప్తును తోసిపుచ్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి పోలీస్‌ కస్టడీకి వచ్చిన ముగ్గురు నిందితులు కూడా విచారణలో కొత్త విషయాలు వెల్లడించట్లేదని తెలుస్తోంది. అరెస్టయినప్పుడు చెప్పిన కారణాలనే పునరావృతం చేస్తున్నట్లు చెబుతున్నారు. 

గ్రామ కక్షలపైనే ఫోకస్‌ 
గట్టు వామన్‌రావు దంపతుల హత్యకు సొంత గ్రామం గుంజపడుగులో నాలుగు నెలల కిందటే ప్లాన్‌ వేసినా.. గ్రామంలో జనం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదని విచారణలో తేలినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత సోదరుడి చేతిలో సర్పంచిగా ఓడిపోయిన తనను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా.. పెద్దమ్మ దేవాలయ నిర్మాణాన్ని, తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడనే కసి కుంట శ్రీనివాస్‌లో ఉంది. గ్రామంలోని శ్రీ రామస్వామి గోపాలస్వామి దేవాలయ కమిటీ విషయంలో ఏర్పడ్డ వివాదాలకు కూడా గట్టు వామన్‌రావు కారణమని భావించి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలసి హత్యకు ప్లాన్‌ చేశాడనేది పోలీసుల వాదన. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా ఈ కోణంలోనే కన్పిస్తున్నాయి. గురువారం రామగుండం సీపీ కార్యాలయంలో ఆలయ కమిటీ వివాదంపై విచారణ జరిపారు. రెండు ఆలయాల్లో కమిటీ సభ్యుల్లో బ్రాహ్మణ, ముదిరాజ్, మున్నూరు కాపు, ఎస్సీ తదితర సామాజికవర్గాల వారు ఉన్నారు. గ్రామంలో నెలకొన్న మూడు వివాదాల చుట్టే పోలీసులు కేసును నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బిట్టు శ్రీనుకు చంపించేంత కక్ష ఉందా? 
సోదరుడి చేతిలో అవమానాల పాలు కావడం, ఇల్లు, గుడి నిర్మాణాలను నిలిపివేయించడం, ఓ దేవాలయం కమిటీ విషయంలో అడ్డంకులు సృష్టించడం వంటి కారణాలతో గట్టు వామన్‌రావును చంపాలని కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ హత్యలో పాలుపంచుకున్న బిట్టు శ్రీనుకు మాత్రం అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడనే విషయంలో పోలీసులు చెబుతున్న కారణాలు అంత బలంగా లేవు. నెలకు రూ.30 వేల రాబడి వచ్చే చెత్త ట్రాక్టర్‌ కాంట్రాక్టు రద్దు, పుట్ట లింగమ్మ ట్రస్ట్‌లో అవకతవకలు జరిగాయని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, కేసులు వేయడంతోనే గట్టు వామన్‌రావుపై కక్ష పెంచుకున్నాడని బిట్టు శ్రీనుపై అభియోగాలు మోపారు. అయితే ఇక్కడే పోలీసులు విచారణ లోతుగా జరపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.

పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక క్వారీలు, ఇతరత్రా అక్రమాల్లో రూ.వందల కోట్లు ఆర్జించారని కోర్టుల్లో దావాలు వేసిన గట్టు వామన్‌రావు.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. దళిత యువకుడి హత్య కేసు అందులో ప్రధానమైంది. పుట్ట లింగమ్మ ట్రస్ట్‌ ద్వారా చేసే సేవా కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆదాయ మార్గాలేంటి? ఇందులో అవకతవకలు జరిగాయని హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు వామనరావు ఫిర్యాదులు చేశారు. ఈ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్న బిట్టు శ్రీనుకు ఇక్కడే కక్ష పెరిగిందని అర్థమవుతోంది. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే కొత్త కోణాలు ఏవైనా బయటకు వస్తాయో చూడాలి.  

పోలీసుల కస్టడీలో ముగ్గురి విచారణ 
జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌లను తమ కస్టడీలోకి తీసుకొని రామగుండం కమిషనరేట్‌లో పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సీసీఎస్‌ పోలీసులు వివిధ కోణాల్లో వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా, హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడవేసిన నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు గజ ఈతగాళ్లను విశాఖపట్నం నుంచి రప్పించినట్లు తెలిసింది. వీరు శనివారం సుందిళ్ల బ్యారేజీలోకి దిగనున్నారు.  

మరిన్ని వార్తలు