వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే విలువలు కాపాడుకోవాలి

6 Aug, 2022 02:21 IST|Sakshi

ఓయూ స్నాతకోత్సవంలో సీజేఐ ఎన్‌వీ రమణ సూచన 

నేటి యువత ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది 

ప్రపంచీకరణతో జీవన విధానంలో భారీ పరివర్తన 

రాజ్యాంగమే అంతిమ రక్షణ కవచం 

సీజేఐ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచీకరణతో ప్రపంచ సంస్కృతి వైపు మనం వెళుతున్నామని, ప్రపంచ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని చుట్టుముడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే మన విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్‌ తమిళిసై సౌందర రాజన్‌.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. నేటి యువత అనేక సవాళ్లను ఎదర్కొంటోందని, మన జీవన విధానం భారీ పరివర్తనకు గురయ్యిందని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. మన తిండి, భాష, బట్టలు, ఆటలు, పండుగలు వగైరాలు మన గతంతో పెనవేసుకుపోయాయన్నారు.  

సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం 
యునెస్కో 2021 నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోమాట్లాడే 7 వేల భాషల్లో సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతో పాటు, జానపద కథలు, తరాల వారసత్వంగా లభించిన విజ్ఞానాన్ని కోల్పోతామని జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం క్రమంగా మారుతోందని, కొత్త వంగడాల రాకతో అనేక మార్పులొచ్చాయని అన్నారు.

ఆర్థిక వ్యవస్థ మార్పులకు లోనవడంతో పంటలు మార్పులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం, పరిపాలనపై సబ్జెక్టులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే  మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సీజేఐ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని ఆయన సూచించారు.  

పీవీ, కేసీఆర్‌ ఓయూ ప్రొడక్ట్‌లే.. 
ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్‌ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్‌ వలస పాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందన్నారు. బ్రిటిష్‌ పాలన నుంచి స్వతంత్ర భారత్‌గా అవతరించే వరకు వెలుగురేఖలు పంచిందన్నారు. ఎంతో మంది దార్శనికులను తయారు చేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకత అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఓయూ ప్రొడక్ట్‌లేనని గుర్తు చేశారు.  

ఓయూలో చేరాలనుకున్నా.. 
ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్‌ ఎస్‌ రాధాకృష్ణన్, అంబేడ్కర్‌ వంటి 42 మంది మహనీయులు ఓయూ నుంచి గౌరవ డాక్టర్‌ను స్వీకరించారని చెప్పారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా తనకా అవకాశం దక్కలేదని, కోరిక నెరవేరలేదని గత స్మృతులను నెమరేసుకున్నారు.

ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివి జస్టిస్‌ రమణ మాతృ భాషపై గల మమకారాన్ని చాటుకున్నారు.. హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్‌మెడల్స్, 211 పీహెచ్‌డీ అవార్డులను విద్యార్థులకు ప్రదానం చేశారు.  

లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలి
విజయానికి సత్వర మార్గాలు ఉండవని, లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు  ఎదురుకోవాల్సిందేన్నారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సాధారణంగానే ఉండాలని, అసాధారణ పనులు చేయాలన్నారు.  ప్రస్తుతం ఐదు నిమిషాలు కూడా మొబైల్‌ని పక్కకు పెట్టే పరిస్థితి లేదని, ఫోన్లను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు