వచ్చే నెల 18 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు 

30 Aug, 2021 04:16 IST|Sakshi

సీపీజీఈటీ–2021 షెడ్యూల్‌ ప్రకటించిన కన్వీనర్‌ 

అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 12 వరకు దరఖాస్తులకు అవకాశం 

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)–2021ను వచ్చే నెల 18 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి ఆదివారం తెలిపారు. 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూలును ఉస్మానియా, పీజీ అడ్మిషన్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విభాగాలుగా పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

40 వేలకు చేరిన మొత్తం సీట్లు 
రాష్ట్రంలోని పలు వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7 వేల సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని పాండు రంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీకు ఈ నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిందని, ఇప్పటివరకు 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్షకు రూ.500 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 6 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

మరిన్ని వార్తలు