ఓటీపీ ప‘రేషన్‌’.. మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు

4 Feb, 2021 08:06 IST|Sakshi
నల్గొండ మీ సేవ కేంద్రంలో కిటకిటలాడుతున్న లబ్ధిదారులు

ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెబితేనే సరుకులు ఇస్తుండటంతో ఇక్కట్లు

ఇదివరకున్న బయోమెట్రిక్‌ విధానం కరోనా కారణంగా నిలిపివేత

ఫోన్‌ నంబర్‌తో ఆధార్‌ అనుసంధానానికి ప్రజలకు అగచాట్లు

స్పందించిన పౌరసరఫరాల శాఖ.. ‘ఐరిస్‌’ ద్వారా ఇవ్వాలని ఉత్తర్వులు

రేషన్‌షాపుల్లో ఈ–పాస్‌ ద్వారా ఫోన్‌ నంబర్ల నమోదుకు ఆధార్‌ సంస్థ ఓకే

సాక్షి, నెట్‌వర్క్‌: మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) చెబితేనే రేషన్‌ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలివ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా కార్డులున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకు అమలులో ఉన్న బయోమెట్రిక్‌ (వేలిముద్రల) ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో బ్రేక్‌ పడింది. ఇటు ఐరిస్‌ లేదా మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపించడం ద్వారా రేషన్‌ ఇవ్వొచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి.

దాదాపు దశాబ్దం కిందటనే అందరూ ఆధార్‌ కార్డులు తీసుకున్నారు. అప్పట్లో చాలామందికి మొబైల్‌ ఫోన్లు లేకపోవడం, ఉన్నవారు కూడా ఆ తర్వాతకాలంలో ఫోన్‌ నంబర్లు మార్చడంతో ఆధార్‌తో అనుసంధానం అటకెక్కింది. ఆహార భద్రతా కార్డులున్నా చాలామందికి మొబైల్‌ ఫోన్లు లేవు. చదువురాని వారు కూడా ఈ ఓటీపీ విధానంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సరుకులు తీసుకోవడానికి రేషన్‌ షాపుల వద్ద ఆలస్యం జరుగుతోంది.

క్యూ కట్టిన జనం..
రేషన్‌ సరఫరాలో వస్తున్న ఇబ్బందులతో మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. అయితే మండలానికి ఒక కేంద్రానికే ఆధార్‌–ఫోన్‌ నంబర్‌ లింకు చేసే అనుమతి ఇవ్వటంతో ఆయా కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు పిల్లాపాపలతో అగచాట్లు పడుతున్నారు. ఒక్కో అనుసంధాన ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా రద్దీ ఎక్కువ కావటం, సర్వర్‌ డౌన్‌ అవుతుండటంతో అరగంట నుంచి గంట సమయం పడుతోంది.

బుధవారం కరీంనగర్, వరంగల్, నల్లగొండ తదితర ఉమ్మడి జిల్లాల్లో అన్ని చోట్లా అనుసంధానం కోసం భారీ క్యూలు కట్టి వృద్ధులు, మహిళలు అనేక అవస్థలు పడ్డారు. ఇటు కార్డుదారుల కళ్లను కొన్ని ఐరిస్‌ యంత్రాలు సాంకేతిక సమస్యలతో గుర్తించకపోవడం వల్ల కూడా పూర్తిగా రేషన్‌ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు మీసేవ కేంద్ర నిర్వాహకులు ఇదే అదనుగా ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ అనుసంధానానికి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు.. వెరసి ప్రజలు మీసేవ కేంద్రాలు, రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.. 

ఐరిస్‌కు ప్రాధాన్యం..
ఆధార్‌తో మొబైల్‌ ఫోన్‌ అనుసంధానం కాకపోయినా సరే.. ఐరిస్‌కు ప్రాధాన్యతనిచ్చి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్‌ షాప్‌ డీలర్లంతా ఐరిస్‌ ద్వారా బియ్యం పంపిణీ సాధ్యం కాని పక్షంలోనే ఓటీపీ అడగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ఆదేశించారు. ఆధార్‌ డేటాబేస్‌లో కార్డుదారుల ఫోన్‌ నంబర్లను ఈ–పాస్‌ ద్వారా అనుసంధానం చేయడానికి ఆధార్‌ సంస్థ అంగీకరించిందని, అందుకోసం డేటాబేస్‌లో అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రేషన్‌ డీలర్లకు ఒక్కో దానికి రూ.50 సర్వీసు చార్జీ కింద లభిస్తుందని అనిల్‌కుమార్‌ వివరించారు. ఇందుకోసం ఆధార్‌ సంస్థ ప్రతినిధులు మెగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు