తెలంగాణ విద్య, ఉద్యోగ సమాచారం

7 May, 2022 14:29 IST|Sakshi

ఓయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు 18 నుంచి  
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షల టైంటేబుల్‌ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.  

గూప్స్‌పై రేపు 21వ సెంచరీ అవగాహన సదస్సు 
సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ చైర్మన్‌ కృష్ణప్రదీప్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని తమ అకాడమీలో ఈ కార్యక్రమం ఉంటుందని, సిలబస్, ప్రిపరేషన్, వ్యూహాలు, నోట్స్‌ తయారీ, సమయపాలన వంటి అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733 లో సంప్రదించవచ్చని సూచించారు. 

పీజీ సెమిస్టర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి  
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్‌ పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్‌ కంట్రోలర్‌ ప్రొ.అంజయ్య శుక్రవారం పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్‌ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చని తెలిపారు.

జూలై 23న డీసెట్‌  
సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 9 నుంచి జూన్‌ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలని సూచించారు. 

‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు 22 వరకు
గచ్చిబౌలి: మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. శుక్రవారంతో ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్‌సైట్‌ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ రెగ్యులర్‌ మోడ్‌ కింద ఎంట్రన్స్‌ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

సింగరేణిలో గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఫలితాలు 
సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో 665 గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది. 2017 జూలైలో నోటిఫికేషన్‌ జారీ చేసిన ఈ పోస్టులకు 60 వేల మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నారు. 2018 జూన్‌ 10న నిర్వహించిన పరీక్షలో 27,279 మంది అభ్యర్థులు హాజర య్యారు. అన్ని విధాలుగా అర్హులైన 665 మందికి నెలరోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం భావించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న  సంకల్పంతో కేసుల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయడం హర్షణీయమని పలువురు పేర్కొన్నారు.

మే 7న బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్‌ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్‌ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు