పేద మహిళల పెన్నిధి ‘స్త్రీ నిధి’ 

31 Mar, 2022 01:30 IST|Sakshi

స్టేట్‌ బ్యాంకు తర్వాత దేశంలోనే అత్యధిక రుణాలిచ్చింది: ఎర్రబెల్లి  

ఏజీ వర్సిటీ: ‘దేశానికి స్త్రీ నిధి సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది.  ఇది లక్షలాది మంది పేద మహిళల పెన్నిధి’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశంలో స్టేట్‌ బ్యాంకు తర్వాత అత్యధిక రుణాలిచ్చింది ఈ సంస్థేనని చెప్పారు. పదేళ్ల కిందట రూ.32 కోట్లతో మొదలై ఈ రోజు రూ.5,300 కోట్లకు చేరిందని, ఇది తెలంగాణలోని మహిళల ఘనతని అన్నారు.

స్త్రీ నిధి ద్వారా ఇప్పటివరకు 3.97 లక్షల మహిళా సంఘాల్లోని 26.92 లక్షల మంది సభ్యులకు రూ.14,339 కోట్ల రుణాలిచ్చారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లు రుణాలుగా అందించారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో ‘స్త్రీ నిధి’9వ సర్వసభ్య సమావేశం జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ‘గతంలో మహిళలకు డబ్బులు అవసరమైతే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇçప్పుడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఇందులో స్త్రీనిధి, సీఎం కేసీఆర్‌ పాత్ర ఎంతో ఉంది’అని ఎర్రబెల్లి అన్నారు. రుణాలివ్వడానికి బ్యాంకులు షూరిటీలు అడుగుతాయని, స్త్రీ నిధి వచ్చాక డ్వాక్రా సంఘాల మహిళలకు షూరిటీ లేకుండా అప్పులిస్తున్నారని చెప్పారు. అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తామని, స్త్రీనిధి కమిటీ కాలపరిమితిని రెండేళ్లకు పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి స్త్రీ నిధి సంస్థకు ప్రత్యేక భవనాన్ని నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు