సింగరేణికి ‘పరీక్ష’.. ఉద్యోగ నియామక బాధ్యతలపై మల్లగుల్లాలు

18 Aug, 2022 09:14 IST|Sakshi

177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు లక్షకుపైగా దరఖాస్తులు

నిర్వహణ బాధ్యతలు జేఎన్‌టీయూకు అప్పగించే విషయంలో మల్లగుల్లాలు

జేఎన్‌టీయూ ఫీజుపై కొలిక్కిరాని చర్చలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉద్యోగ నియామకాల విషయంలో తరచుగా విమర్శల పాలయ్యే సింగరేణికి మరో విషమ ‘పరీక్ష’ఎదురైంది. ఇటీవల సంస్థ.. జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ తేదీ విషయమై డోలాయమానంలో పడినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సింగరేణి సంస్థ 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 (క్లరికల్‌) పోస్టుల భర్తీకి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ముగిసే సరికి రికార్డు స్థాయిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్‌లోనే సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహిస్తామని సింగరేణి ప్రకటించినా, తేదీ సమీపిస్తున్నప్పటికీ సంస్థ తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది.

థర్డ్‌ పార్టీకి బాధ్యతలు
నియామకాల్లో పారదర్శకత పాటించేందుకు సింగరేణి సంస్థ థర్డ్‌పార్టీకి పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోంది. అందులో భాగంగా జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్షల బాధ్యతను జేఎన్‌టీయూకి అప్పగించాలని నిర్ణయించింది. హాల్‌టికెట్ల జారీ మొదలు, జవాబుపత్రాల మూల్యాంకనం, మెరిట్‌ జాబితా రూపకల్పన అంశాలన్నీ థర్డ్‌ పార్టీగా జేఎన్‌టీయూనే నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందస్తు అంచనాల ప్రకారం పరీక్షల నిర్వహణకు రూ.కోటి వరకు చెల్లించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే, జేఎన్‌టీయూ రూ.3 కోట్లు చెల్లించాలని అంటోంది. దీంతో ఫీజు విషయమై ఎటూ తేల్చుకోలేక సింగరేణి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

గతంలో ఆరోపణలు
సింగరేణి ఆధ్వర్యంలో 2015లో చేపట్టిన నియామకాలు సంస్థకు చెడ్డపేరు తెచ్చాయి. ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని, కొందరు ఉద్యోగార్థులు ముందుగానే ప్రశ్నపత్రాలు సంపాదించి హోటల్‌ గదుల్లో సిద్ధమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సింగరేణి సంస్థ కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలు జేఎన్‌టీయూకే అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఏ పరీక్ష జరిగినా బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించొద్దంటూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడం ఆనవాయితీగా మారింది.

రంగంలోకి దళారులు
తాజాగా సింగరేణి నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్‌ రావడమే ఆలస్యం.. దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారులకు ఫోన్లుచేసి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో బేరం మాట్లాడటం మొదలెట్టారు. ఇది బయటపడటంతో సింగరేణి సంస్థ అంతర్గతంగా ప్రత్యేక విజిలెన్స్‌ బృందాలను నియమించి విచారణ చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే అభ్యర్థుల ఫోన్‌ నంబర్లు బయటకు రావడం, దళారుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలియడంతో సింగరేణి అ«ధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణ ఫీజు విషయంలో సింగరేణి, జేఎన్టీయూ మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంపై సింగరేణి సంస్థ దృష్టి సారించినట్టు సమాచారం.

ఇదీ చదవండి: SCCL Recruitment 2022 Notification: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు