మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా?

20 Oct, 2022 10:03 IST|Sakshi

సాక్షి, యాద్రాద్రి: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

కాగా, తాజాగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టిన ఘటనపై కాషాయ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత మనోహర్‌రెడ్డి తెలిపారు. సమాధి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడు ఓడిపోతామన్న భయంతోనే, ప్రజా మద్దతు లేకే టీఆర్‌ఎస్‌ చిల్లర పనులు చేస్తోందని ఆరోపణలు చేశారు. 

ఇదిలా ఉండగా.. మునుగోడు ఓటర్లకు ప్రలోభాలు వేగవంతమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ రాజకీయ పార్టీ పంపకాలకు శ్రీకారం చుట్టేసింది. ఇంటింటికీ కిలో చికెన్, 2 లీటర్ల థమ్సప్‌ పంపిణీ చేసింది. చౌటుప్పల్‌ మండలంలోని ఒక గ్రామానికి ఓ పార్టీ నేత ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో 2200 మంది ఓటర్లు, 812 కుటుంబాలున్నాయి. గ్రామ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నేత అనుచరులు, స్థానిక లీడర్లు కలిసి 90శాతం కుటుంబాలకు చికెన్, థమ్సప్‌ పంపిణీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల నుంచి మొదలుపెట్టి గంటలో పంపిణీని పూర్తి చేశారు.   

మరిన్ని వార్తలు