దేశ ఆరోగ్య వ్యయంలో సగం భారం ప్రజలదే

26 Dec, 2022 00:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగంలో ఎన్ని పథకాలు తీసుకువస్తున్నా.. వైద్య సదుపాయాలు పెంచుతున్నట్టు చెప్తున్నా.. ప్రజలపై భారం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఆరోగ్యంపై జరుగుతు­న్న మొత్తం వ్యయంలో సగం ఖర్చును ప్రజలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఉంది.

ఇది పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు గణనీయంగా పెరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు అవసరమైన మేర పెరగడం లేదని, ప్రజలపైనే భారం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే.. 
దేశంలో రాష్ట్రాల వారీగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2018–19 నాటి అంచనాల ప్రకారం తయారు చేసిన ఈ నివేదికపై ఇటీవల పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దాని ప్రకారం దేశంలో ఆరోగ్యంపై మొత్తంగా రూ.5,96,440 కోట్లు వ్యయం అవుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నది రూ.2,42,219 కోట్లే. అంటే సుమారు 41 శాతం మాత్రమే. అదే ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (సుమారు 48శాతం) కావడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం), మిగతా సొమ్ము వివిధ స్వచ్చంద  సంస్థలు, ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య ఖర్చుల కోసం అందుతోంది. 

ప్రభుత్వాల వ్యయం పెరుగుతున్నా.. 
ఆరోగ్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత ఖర్చు తగ్గుతోందని.. ప్రభుత్వాల వ్యయం పెరుగుతోందని కేంద్ర నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015–16లో ప్రభుత్వాల ఖర్చు సుమారు 30 శాతం వరకే ఉండగా ఇప్పుడు 41 శాతానికి చేరింది. ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాల వాటా గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం, మిగతా భారం ప్రజలపై పడటం సరికాదని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల ఖర్చు 10 శాతం వరకే ఉండాలని, ప్రభుత్వాలే వ్యయం పెంచాలని స్పష్టం చేస్తున్నారు. 

యూపీలో ఎక్కువ ఖర్చు 
దేశంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.78,297 కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.66,703 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో రూ.45,277 కోట్లు, కేరళ రూ.34,548 కోట్లు, తమిళనాడులో రూ.32,767 కోట్లు, కర్ణాటకలో రూ.32,198 కోట్లు, రాజస్థాన్‌లో రూ.29,905 కోట్లు, గుజరాత్‌లో రూ.26,812 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25,828 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.20,725 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వాలే భరించే ఖర్చు ప్రకారం చూస్తే.. ఉత్తరాఖండ్‌ 61 శాతంతో టాప్‌లో నిలిచింది. 

 
నివేదికలో ముఖ్యాంశాలివీ.. 
 దేశంలో 2018–19 సంవత్సరానికి మొత్తం ఆరోగ్య వ్యయం రూ.5,96,440 కోట్లు (ఇది జీడీపీలో 3.16 శాతం.. తలసరి ఖర్చు రూ.4,470). 
మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.2,42,219 కోట్లు (తలసరి రూ.1,815)కాగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7 శాతంగా ఉంది. 
కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్‌పై చేస్తున్న వ్యయం రూ.30,578 కోట్లు, డిఫెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ కింద రూ.12,852 కోట్లు, రైల్వే హెల్త్‌ సర్వీసెస్‌ రూ.4,606 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) రూ.4,060 కోట్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌కు రూ.3,226 కోట్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఖర్చులు కలిపి రూ.12,680 కోట్లు. 
ఆరోగ్యంపై ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (మొత్తం ఆరోగ్య వ్యయంలో 48.21 శాతం.. తలసరిన చూస్తే రూ.2,155), ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం). 
మొత్తంగా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో రూ.93,689 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.1,55,013 కోట్లు (28.69%). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలకు కలిపి చేసే ఖర్చు రూ.41,875 కోట్లు, ఇతర ప్రైవేట్‌ ప్రొవైడర్లకు (ప్రైవేట్‌ క్లినిక్‌లతో సహా) రూ.23,610 కోట్లు, పేషెంట్‌ ట్రాన్స్‌పోర్ట్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్రొవైడర్లకు రూ.18,909 కోట్లు, మెడికల్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ లేబొరేటరీలకు రూ.21,162 కోట్లు, ఫార్మసీలకు రూ.1,22,077 కోట్లు, ఇతర రిటైలర్లకు రూ.643 కోట్లు, ప్రివెంటివ్‌ కేర్‌ ప్రొవైడర్లకు రూ.28,841 కోట్లు, హెల్త్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సింగ్‌ ప్రొవైడర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణలకు దాదాపు రూ. 21,612 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని నిధులు ఇతర అవసరాలకు ఖర్చవుతున్నాయి. 
తెలంగాణలో జీఎస్‌డీపీలో మొత్తం ఆరోగ్య ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 0.7 శాతం, ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 0.9 శాతం, ఆరోగ్య బీమా, ఇతర వ్యవస్థల ద్వారా 0.2శాతం ఖర్చు జరుగుతోంది. 
 
దేశంలో ఆరోగ్యంపై వ్యయం తీరు ఇలా.. (రూ.కోట్లలో) 
అంశం           2015–16    2016–17    2017–18    2018–19 
ప్రభుత్వ ఖర్చు        1,61,863    1,88,010    2,31,104    2,42,219 
ప్రజల సొంత ఖర్చు        3,20,211    3,40,196    2,76,532    2,87,573 
ప్రైవేట్‌ బీమా కంపెనీలు    22,013        27,339        33,048        39,201 
 
క్యూబాలో జనం సొంత ఖర్చు 8 శాతమే.. 
ప్రపంచంలో ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చులో ప్రజలు సొంతంగా చేస్తున్నది 36 శాతమే. మన దేశంలో అది 48 శాతంగా ఉంది. అదే క్యూబా వంటి దేశంలో కేవలం 8 శాతమే. మన దేశంలో ప్రజల ఖర్చు తగ్గుతూ వస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నా.. ప్రభుత్వాలు భరించే మొత్తం గణనీయంగా పెరగాల్సి ఉంది.

బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచడం వల్ల ప్రజల జేబు ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్‌ బీమా కంపెనీలు ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్, ఇతర ఆరోగ్య పథకాలతో ప్రయోజనం ఉంటోంది. 
 డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ 
 
జేబు ఖర్చు 10శాతం లోపే ఉండాలి 
ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని అనిపిస్తోంది. మాకున్న అంచనా ప్రకారం 80శాతం ఆరోగ్య ఖర్చును ప్రజలే భరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. అది ప్రజలపై పెను భారమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు కేవలం 10 శాతమే.

డెన్మార్క్, చెకోస్లావేకియా, చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటిచోట్ల ఎక్కువగా ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల బీమా పథకాలు ఉన్నాయి. కానీ బీమా కంపెనీలు ఎక్కువ ధరలతో కూడిన మందులు ఇవ్వడానికి, ఖర్చుకు ముందుకు రావు. అమెరికాలో వస్తున్న సమస్య ఇదే. అందువల్ల దేశంలో ప్రభుత్వమే ఖర్చు పెంచాలి. 
– డాక్టర్‌ యలమంచి రవీంద్రనాథ్, ప్రముఖ వైద్యుడు, ఖమ్మం   

మరిన్ని వార్తలు