కోవిడ్‌ రోగులకు ఊపిరి ఆడట్లే

24 Apr, 2021 14:30 IST|Sakshi

ఆక్సిజన్‌ లేక కోవిడ్‌ రోగుల ఇక్కట్లు

ఐసీయూ అడ్మిషన్లకు ఆస్పత్రులు నో

వెంటిలేటర్‌ రోగులను వదిలించుకుంటున్న వైనం

ప్రాణ వాయువే కాదు.. రెమ్‌డెసివిర్‌ మందులకు ఇబ్బందే..

ఆందోళనలో రోగులు.. బంధువులు 

కోవిడ్‌ రోగులకు ఊపిరి ఆడట్లే..అందట్లే. బెడ్లు లేక..రోగులను చేర్చుకోక నగర ఆస్పత్రుల్లో విపత్కర..దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయి. చికిత్సలో అతిముఖ్యమైన ఆక్సిజన్‌ అందక వందలాది మంది రోగులు విలవిల్లాడుతున్నారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్‌ కోసం ఆరేడు ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేక శుక్రవారం ఒక మహిళ అంబులెన్స్‌లోనే మృతిచెందడం ఇందుకు తార్కాణం. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్‌ అవసరం కాగా..కేవలం 260 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వందలాది ఆస్పత్రులు ఆక్సిజన్‌ లేదంటూ సీరియస్‌ రోగులకు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. వెంటిలేటర్‌ రోగులను ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటూ వదిలించుకుంటున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే కోవిడ్‌ రోగులను చేర్చుకోవడం లేదు.

‘ఉప్పల్‌ సమీపంలోని 150 పడకల స్పెషాలిటీ ఆస్పత్రి అది. కోవిడ్‌ రోగులకు 30 పడకలు కేటాయించగా, వీటిలో 9 ఐసీయూ వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందే 25 మందికి రోజుకు 60 లీటర్ల ఆక్సిజన్‌ అవసరమైతే..ఒక్క ఐసీయూ వెంటిలేటర్‌ రోగికే హై ఫ్రీక్వెన్సీలో 60 లీటర్లు అవసరం అవుతుంది. రోగుల అవసరాలకు రోజుకు కనీసం పది సిలిండర్ల ఆక్సిజన్‌ అవసరం కాగా...ప్రస్తుతం రోజుకు ఒకటి రెండుకు మించి సరఫరా కావడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్యులు ఐసీయూ చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉన్న వారిని కూడా ఇతర ఆస్పత్రులకు తరలించారు’  

.. ఇలా ఒక్క ఉప్పల్‌లోని స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాదు..25 నుంచి 150 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రులన్నీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రిలో రోగులకు సరిపడా వెంటిలేటర్లు, వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రాణవాయువు సహా రెమిడెసివిర్‌ వంటి మందులు లేక ఆయా చికిత్సలను నిరాకరిస్తున్నాయి. ఇంటికి సమీపంలో ఉన్న స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్సలు అందక...గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. 

రోజువారీ ఆక్సిజన్‌ డిమాండ్‌: 384 టన్నులు 
సరఫరా చేస్తున్నది: 260 టన్నులు 
రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు అవసరం: 4 లక్షలు 
కేటాయించింది: 21550 ఇంజెక్షన్లు 
ఒక ఐసీయూ వెంటిలేటర్‌ రోగికి రోజుకు అవసరమయ్యే ఆక్సిజన్‌: 60 లీటర్లు  

384 టన్నులకు..260 టన్నులే సరఫరా 
తెలంగాణ వ్యాప్తంగా 62 ప్రభుత్వ, 244 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు కోవిడ్‌ చికిత్సలకు అనుమతి పొందాయి. వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 150 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందాలంటే వీటికి రోజుకు కనీసం 384 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ 260 టన్నులకు మించి సరఫరా చేయడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్‌ఎంఐడీసీ ద్వారా లిండే సంస్థ సరఫరా చేస్తోంది. గాంధీకి రోజుకు 26 వేల కిలో లీటర్లు, ఉస్మానియాకు 20, నిలోఫర్‌కు 20, కింగ్‌కోఠికి 13, టిమ్స్‌కు 20 వేల కిలో లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు.

యశోద, కేర్, కిమ్స్, ఏఐజీ, అపోలో, కాంటినెంటల్, ఎస్‌ఎల్‌జీ, కామినేని, సన్‌షైన్, మల్లారెడ్డి, శ్రీకర, గ్లోబల్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎప్పటికప్పుడు నిల్వలు సరిచూసుకుంటున్నాయి. ఆక్సిజన్‌ కేటాయింపులో ప్రభుత్వం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ పెద్దగా ఆక్సిజన్‌ సమస్యలు రావడం లేదు. కానీ వంద పడకల్లోపు ఉన్న కోవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రిలో తగినంత మేర నిల్వలు లేక..డిమాండ్‌ మేరకు డీలర్లు సరఫరా చేయకపోవడంతో ఆయా ఆస్పత్రులు ఐసీయూ చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. సాధారణ ఆక్సిజన్‌ అవసరమైన రోగితో పోలిస్తే.. వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ఆక్సిజన్‌ ఎక్కువ అవసరం అవుతుండటమే ఇందుకు కారణం. అంతేకాదు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను కార్పొరేట్‌ ఆస్పత్రులకే ఎక్కువ కేటాయిస్తున్నాయి.

రెమ్‌డెసివిర్‌ వంటి మందులను కూడా వాటికే ఎక్కువ సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణకు 4లక్షల రెమ్‌డెసివిర్‌ మందులు కేటాయించాల్సిందిగా కోరితే...కేవలం 21,550 వాయిల్స్‌ మాత్రమే కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేటాయించిన మందులు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులకే ఎక్కువ సంఖ్యలో మళ్లిస్తుండటం, వంద పడకల్లోపు ఆస్పత్రులకు ఈ ఔషధాలు సరఫరా చేయకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో ఆయా ఆస్పత్రులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు చికిత్సలు నిరాకరిస్తున్నాయి. చేర్చుకున్నా ఆ మందులు తెచ్చుకునే బాధ్యతను రోగుల బంధువులకే అప్పగిస్తున్నాయి.

  

ముడిసరుకు కొరత
జీడిమెట్ల: ఆక్సిజన్‌ తయారీ కోసం వినియోగించే ముడిసరుకు కొరత కారణంగానే ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో మార్కెట్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రమైంది. జీడిమెట్లలోని ఆక్సిజన్‌ తయారీ పరిశ్రమల వద్ద  సిలిండర్‌ల కోసం వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. కేవలం డీలర్లేగాకుండా..కరోనా బాధిత కుటుంబాలు కూడా నేరుగా ఫిల్లింగ్‌ సెంటర్ల వద్దకు వస్తున్నారు. సిలిండర్‌కు ఎంతైనా చెల్లిస్తామంటూ మొర పెట్టుకుంటున్నారు. కరోనా వైరస్‌ ఉధృతితో రాత్రింబవళ్లు సరఫరా చేసినా డిమాండ్‌ మేరకు భర్తీ చేయలేకపోతున్నట్లు పలు పరిశ్రమలకు చెందిన నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆక్సిజన్‌ సిలిండర్‌ల కోసం ఏజెంట్లపైనా ఆసుపత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ‘ఒకప్పుడు  వంద సిలిండర్‌లు సరఫరా చేసేవాన్ని. ఇప్పుడు ఏకంగా వెయ్యి కావాలని డిమాండ్‌ చేస్తే ఎక్కడి నుంచి తెప్పించగలను. చాలా కష్టంగా ఉంది.’ అని జీడిమెట్లకు చెంది న ఒక ఆక్సిజన్‌ సరఫరా ఏజెంట్‌  ఆందోళన వ్యక్తం చేశారు.  ఇక సిలిండర్‌ ధర విషయానికి వస్తే నిర్ణయించిన రేటు కంటే ఐదింతలు పెంచేశారు..   

నిండుకున్న ముడిసరుకు.. 
ఆక్సిజన్‌ ఉత్పత్తికి వైజాగ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరగడంతో ముడిసరుకు రవాణా ఆగిపోయింది. బుక్‌ చేసిన ముడిసరుకులో 50 శాతమే పంపుతున్నారని పరిశ్రమల నిర్వాహకులు తెలిపారు.  ఒక్కో పెద్ద సిలిండర్‌లో 7 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ పట్టే సామర్థ్యం ఉంటుంది. ఒక్క క్యూబిక్‌ మీటర్‌కు రూ.25  చొప్పున 7 క్యూబిక్‌ మీటర్లకు గతంలో రూ.175 ఉండేది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ ధర 500 నుంచి రూ.800లకు చేరింది. 

మరిన్ని వార్తలు