ఆక్సిజన్‌ ట్యాంకర్లు వచ్చేశాయి.. 

23 May, 2021 03:36 IST|Sakshi

11 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను విరాళంగా ఇస్తున్న మేఘా సంస్థ 

బేగంపేట విమానాశ్రయంలో మూడు ట్యాంకర్లను అందుకున్న సీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకాక్‌ నుండి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానం ద్వారా శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మూడు క్రయోజెనిక్‌ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆ సంస్థ అందజేసింది. వెంటనే ఈ ట్యాంకర్లను ఆక్సిజన్‌ను నింపుకొని రావడానికి సీఎస్‌ ఒడిశాకు పంపించారు.

మేఘా సంస్థ నుంచి మొదటి విడతగా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళాఖాతంలో వాతావరణ అస్థిరత ఉన్న దృష్ట్యా మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని సీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఆక్సిజన్‌ ప్లాంట్లు, స్టోరేజ్‌ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
 
ఒక్కో ట్యాంకర్‌ తయారీకి మూడు నెలలు.. 
సాధారణంగా ఒక్కో క్రయోజెనిక్‌ ట్యాంకర్‌ తయారీకి దేశంలో మూడునెలల సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అత్యవసరమైన నేపథ్యంలో విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నట్లు మేఘా సంస్థ ఉపాధ్యక్షుడు పి.రాజేశ్‌రెడ్డి వివరించారు. ఈ ట్యాంకర్లను నగరానికి తీసుకుని రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారాన్ని అందించాయని తెలిపారు.

దేశంలో క్రయోజెనిక్‌ ట్యాంకర్ల కొరతను గుర్తించి, విదేశాల నుంచి పూర్తి ఖర్చు తమ సంస్థనే భరించి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే బొల్లారంలోని తమ ప్లాంట్‌నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ఎంఈఐఎల్‌ జీఎం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు