1996 నాటి ఘటన.. కలెక్టర్‌ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి

16 May, 2022 08:56 IST|Sakshi
డబ్ల్యూఆర్‌ రెడ్డి, ఆయన భార్య డబ్ల్యూ మాలతిరెడ్డి  

‘పడ’ సినిమాగా తెరకెక్కిన 1996 నాటి కేరళ పాలక్కడ్‌ కలెక్టర్‌ నిర్బంధం ఉదంతం

 సందర్శకుల్లా వచ్చి ఆయుధాలు, బాంబులతో కలెక్టర్‌ను బంధించిన నలుగురు

9 గంటల ఉత్కంఠ తర్వాత విడుదల

నార్సింగిలో నివసిస్తున్న అప్పటి కలెక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి

‘సాక్షి’తో నాటి ఘటనను గుర్తు చేసుకున్న డబ్ల్యూఆర్‌ రెడ్డి దంపతులు

సాక్షి, హైదరాబాద్‌: 1996 అక్టోబర్‌ 4 ఉదయం 10.45.. కేరళలోని పాలక్కడ్‌ కలెక్టర్‌ కార్యాలయం.. ట్రైబల్‌ ల్యాండ్‌ ఎలియెనేషన్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా నలుగురు సాయుధులు అప్పటి కలెక్టర్‌ ఉదారు రామ్‌ పుల్లారెడ్డిని (డబ్ల్యూఆర్‌ రెడ్డి) నిర్బంధించారు. 9 గంటల ఉత్కంఠ తర్వాత ఆయన్ను విడిచి పెట్టారు. నష్ట నివారణ కోసం కేరళ సర్కారు కూడా కలెక్టర్‌నే టార్గెట్‌ చేసింది. అయినా ఆయన అధైర్యపడలేదు. సీన్‌ కట్‌ చేస్తే.. పదవీ విరమణ చేసిన డబ్ల్యూఆర్‌ రెడ్డి ప్రస్తుతం నార్సింగిలో ఉంటున్నారు. ఆ ఘటన జరిగిన పాతికేళ్ల తర్వాత తాజాగా మలయాళ సినిమా ‘పడ’గా తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే నాటి అనుభవాలను డబ్ల్యూఆర్‌ రెడ్డి, ఆయన భార్య డబ్ల్యూ మాలతిరెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నారు. 

గిరిజనుల భూమి కోసం..
గిరిజనులకు సంబంధించిన భూములను ఎవరైనా ఖరీదు చేస్తే.. వాళ్లు దరఖాస్తు చేసుకుంటే తిరిగి ఇచ్చేయాలనే చట్టం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం ట్రైబల్‌ ల్యాండ్‌ ఎలియెనేషన్‌ యాక్ట్‌ను తీసుకొచ్చింది. గిరిజనుల భూములు ఎవరైనా డబ్బు చెల్లించి ఖరీదు చేస్తే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నది దాని సారాంశం. దీంతో ప్రభుత్వం, మీడియా దృష్టిని ఆకర్షించి గిరిజనుల భూముల్ని రక్షించడానికి గాను సీపీఐ (ఎంఎల్‌) అధీనంలోని అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఓ పథకం వేశారు. అందులో భాగంగానే 1996లో పాలక్కడ్‌ కలెక్టర్‌ నిర్భంధం జరిగింది. 

సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చి..
నలుగురు అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఆ రోజు ఉదయం చేతి సంచులతో సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చారు. నేరుగా డబ్ల్యూఆర్‌ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన తలకు తుపాకీ గురిపెట్టారు. చేతులు వెనుక్కు విరిచికట్టి మెడకు తాడు బలంగా బిగించారు. ఆయన చాంబర్‌లోనే ఓ చిన్న బాంబు పేల్చి తక్షణం ప్రభుత్వం ట్రైబల్‌ ల్యాండ్‌ ఎలియెనేషన్‌ యాక్ట్‌ను వెనక్కు తీసుకోవాలని, లేదంటే కలెక్టర్‌ ప్రాణాలు తీస్తామని బెదిరించారు. దాదాపు 9 గంటల ఉత్కంఠ తర్వాత యాక్ట్‌ ఉపసంహరణకు కేరళ సర్కారు హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ను విడిచిపెట్టారు. 

కలెక్టర్‌నే అనుమానించిన ప్రభుత్వం
కలెక్టర్‌ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారులు తెలివిగా వ్యవహరించారు. తమ వద్ద మారణాయుధాలు, బాంబులు లేవని.. బొమ్మ తుపాకులు, ఉత్తుత్తి బాంబులకే సర్కారు భయపడిందని మీడియాకు చెప్పారు. విషయం సరిచూసుకోకుండా, డబ్ల్యూఆర్‌ రెడ్డిని సంప్రదించకుండా మీడియా కూడా ఇదే ప్రచారం చేసింది. అది ఎన్నికల ఏడాది కావడంతో కేరళ ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా డబ్ల్యూఆర్‌ రెడ్డినే టార్గెట్‌ చేసింది. ఈయన స్వస్థలం కర్నూలు అయినా వరంగల్‌గా ప్రచారం చేస్తూ మావోయి స్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. మావోయిస్టుల సహకారంతోనే పడ ఉద్యమకారులకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా జడ్జి సహకరించారని సంజాయిషీ నోటీసు ఇచ్చింది. పాలక్కడ్‌ నుంచి కొల్లాం బదిలీ చేసింది. అయినా డబ్ల్యూఆర్‌ రెడ్డి మొక్కవోని దీక్షతో విధులు నిర్వర్తించారు. 

మరిన్ని వార్తలు