సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్‌ స్థాయిలో నాట్లు

8 Sep, 2022 01:39 IST|Sakshi

కొత్త రికార్డు సృష్టించిన వరి సాగు

తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో నాట్లు 

ఈ సీజన్‌లో ఇప్పటికే 62.12 లక్షల ఎకరాల్లో వరి పంట

సీజన్‌ నెలాఖరు వరకు మరింత సాగయ్యే అవకాశం

గతేడాది రికార్డు స్థాయిలో 61.94 లక్షల ఎకరాల్లో సాగు

ఈసారి పత్తి ఎక్కువ వేయాలన్న వ్యవసాయ శాఖ

ఫుల్లుగా నీళ్లు, ఉచిత విద్యుత్‌తో వరి వైపే రైతుల మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరిసాగు గత ఏడాది రికార్డును బద్దలు కొట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూలేనంత అత్యధికంగా ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు సాగవడమే కాకుండా ఇంకా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 62.12 లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ నెలాఖరు వరకు సీజన్‌ కొనసాగనున్నందున ఇంకా నాట్లు పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది (2021) కూడా రికార్డు స్థాయిలో ఏకంగా 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇతర పంటలు ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ చెబుతున్నా..సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం, నీటి వనరులు పుష్కలంగా ఉండటం, పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు ఉచిత విద్యుత్‌తో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి ధాన్యపు సిరులు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. 

ఏటా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో వరి సాగు ఏడాదికేడాదికీ పెరిగిపోతోంది. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు పైగానే సాగు కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 45 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. అదే సమయంలో పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలుగా పేర్కొంది. బుధవారం నాటికి 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే పత్తి 49.58 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన సమయంలో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి కూడా లక్షలాది ఎకరాల్లో దెబ్బతింది. రెండోసారి వేసే వీలు కూడా లేకుండాపోయింది. మొత్తం మీద వర్షాలు పత్తి సాగు పెరగకుండా అడ్డుకున్నాయి. దీంతో వరి సాగు గణనీయంగా పెరిగింది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌ లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 6.14 లక్షల ఎకరాల్లో సాగైంది. 

పంటల సాగులో నల్లగొండ టాప్‌..
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్‌ పంటలు సాగయ్యాయి. 11.14 లక్షల ఎకరాల సాగుతో నల్లగొండ టాప్‌లో నిలిచింది. 7.75 లక్షల ఎకరాలతో సంగారెడ్డి, 6 లక్షల ఎకరాలతో వికారాబాద్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేట (5.91 లక్షలు), ఆదిలాబాద్‌ (5.61 లక్షలు), ఖమ్మం (5.56 లక్షలు), కామారెడ్డి (5.12 లక్షలు), నిజామాబాద్‌ (5.10 లక్షలు), నాగర్‌కర్నూల్‌ (5.10 లక్షలు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత తక్కువగా మేడ్చల్‌ (20 వేలు), ములుగు (1.27 లక్షలు), వనపర్తి (2.21 లక్షలు) ఎకరాల్లో సాగయ్యాయి. 

నీటి వనరులు పెరగడం,ఉచిత విద్యుత్‌ వల్లే..
వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ ప్రాంతంలో వరి అంతంతే. కానీ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇస్తుండటంతో రైతులు వరి సాగువైపు మళ్లుతున్నారు. కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్న ధీమాతో వరి వేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 

– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి

మరిన్ని వార్తలు