Paddy Farming: ఆదు‘కొంటారో’ లేదోనని..

23 Dec, 2021 03:05 IST|Sakshi

31లక్షలకుగాను 39,761 ఎకరాల్లో వరి నాట్లు 

245 శాతం పెరిగిన మినుము సాగు 

3.86 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు 

ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం భావించినట్లు ఈ యాసంగి సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం తక్కువ కానుందా? యాసంగి వడ్లు కొనబోమని స్పష్టం చేయడంతో రైతులు ఆ మేరకు సిద్ధమయ్యారా? ప్రస్తుత పరిస్థితి చూస్తోంటే పరిస్థితి అలానే ఉంది. ఈ నెల మొదటి వారం నుంచే సహజంగా వరి నాట్లు పెరుగుతాయి. కానీ చివరి వారంలోకి వచ్చినా వరి నాట్లు పుంజుకోలేదని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. యాసంగిలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.27 లక్షల (22%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 39,761 ఎకరాల్లో (1.25 శాతం)నే నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదించింది. గతేడాది యాసంగిలో ఇదే సమయానికి 1.31 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. వరి వద్దని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో రైతులు వరి సాగుకు వెనకాడుతున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, ఈ సీజన్లో అన్నింటికంటే మినుము సాగు 245 శాతం పెరగగా, పప్పుధాన్యాల సాగు 112% పెరిగినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

ఆదిలాబాద్‌లో అత్యధికంగా సాగు
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యాసంగి పంటల సాగు అత్యధికంగా నమోదుకాగా, మరికొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 97 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఆ తర్వాత నాగర్‌కర్నూలు జిల్లాలో 78 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 62 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అతి తక్కువగా పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో కేవలం ఒక శాతం చొప్పున మాత్రమే పంటలు సాగయ్యాయి. అలాగే మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు శాతం, మెదక్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మూడు శాతం చొప్పున పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు