కొనుగోళ్ల తంటా.. కల్లాల్లోనే పంట!

25 Nov, 2021 01:10 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు 

స్పష్టత ఇవ్వని కేంద్రం.. రవాణా, హమాలీలు, ఇతర సమస్యలతో నత్తనడక

రోజుకు లక్ష టన్నులు కూడా తూకం కాని పరిస్థితి 

1.03 కోట్ల టన్నుల్లో ఇప్పటికి 15 శాతం ధాన్యమే సేకరణ 

కొన్నిచోట్ల నెల రోజుల క్రితం కోసిన పంట కూడా తూకానికి నోచని వైనం 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల క్రితం కోసిన పంట కూడా ఇప్పటికీ తూకానికి రాని పరి స్థితి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నెలకొని ఉంది. కల్లాలు, రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం తడిచిపోయింది. నల్లగొండ, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది.

రాష్ట్రంలో ఆలస్యంగా కోతలు జరిగే మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా రైతులు ధాన్యం కుప్పలను రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు చాలా జిల్లాల్లో లారీల రవాణా కాంట్రాక్టు కొలిక్కి రాలేదు. హమాలీల సమస్య వెంటాడుతోంది. ధాన్యంలో తేమను లెక్కవేసే పరికరాలు, తూకం యంత్రాలు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వీటికి ఓటీపీ సమస్య కూడా తోడవడంతో ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం జరుగుతోంది.  

నెలరోజుల్లో కొన్నది 16.76 లక్షల టన్నులే 
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 61.75 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీని ప్రకారం 1.35 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు , విత్తనాలకు పోగా 1.03 కోట్ల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 6,873 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 5,461 కేంద్రాలను తెరిచారు. కానీ 4,082 కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. గత నెల 25వ తేదీన అధికారికంగా కొనుగోళ్లను ప్రారంభించినప్పటికీ.. నెలరోజుల వ్యవధిలో కేవలం 16.76 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో కేవలం 15 శాతమే కావడం గమనార్హం.  

అకాల వర్షంతో ఆగమాగం 
ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు మందగించాయి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుండడంతో నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదు. దీంతో 4 వేల కేంద్రాల్లో రోజుకు కనీసం లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా సేకరణ జరగడం లేదు. మంగళవారం రాష్ట్రంలో కొనుగోళ్లు ప్రారంభించిన 26 జిల్లాల్లో 95 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.

గత యాసంగి సీజన్‌ ధాన్యం నిల్వలు రైస్‌ మిల్లుల్లో, గోదాముల్లో నిల్వ ఉండడంతో అవి ఖాళీ అయ్యే పరిస్థితి ఆధారంగా కొత్త స్టాక్‌ను మిల్లులకు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 16.76 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.3,281.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా పౌరసరఫరాల సంస్థ ఆయా జిల్లాలకు రూ.912.62 కోట్లు విడుదల చేసింది.  

  • నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 12,425 మంది రైతుల నుంచి కేవలం 96,673 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. 
  • పెద్దపల్లి జిల్లాలో దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, కొనుగోలు లక్ష్యం 4.46 లక్షల మెట్రిక్‌ టన్నులుగా నిర్ధారించారు. కానీ ఇప్పటివరకు 54,015 టన్నులే కొనుగోలు చేశారు.

పదిరోజులుగా పడిగాపులు 
నాకున్న నాలుగు ఎకరాల భూమిలో వరి సాగు చేశా. వరుస వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి 10 రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నాం. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయం తరువాత చేసుకోండి. ముందు ధాన్యం కొనుగోళ్లపై దృష్టిపెట్టండి. 

– పడాల అజయ్‌ గౌడ్, గర్రెపల్లి, పెద్దపల్లి 

ప్రభుత్వం బోనస్‌ ప్రకటించాలి 
వానాకాలం ధాన్యం తడవడం, రైతుల ఇబ్బందుల దష్ట్యా ప్రభుత్వం బోనస్‌ ప్రకటించి త్వరగా కొనుగోలు చేయాలి. తూకంలో కోత లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యం తరలించాలి. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.  

– మల్లారెడ్డి, రైతు, హుజూరాబాద్‌   

మరిన్ని వార్తలు