కేసీఆర్‌ చెప్తేనే అలా చేశాం.. మోసపోయాం.. పరిహారమిచ్చి ఆదుకోండి

2 May, 2022 18:27 IST|Sakshi
ఉప్పల్‌వాయి చెరువు కింద బీడు భూముల్లో పశువులను మేపుతున్న దృశ్యం

ఉప్పల్‌వాయికి చెందిన తిరుమలయ్యకు పెద్ద చెరువు కింద ఏడు ఎకరాల భూమి ఉంది. చెరువులో నీరు ఉండటంతో వానాకాలంలో మొత్తం వరి సాగు చేశాడు. యాసంగిలో కూడా వరి వేద్దామనుకున్నాడు. కానీ ప్రభుత్వం ధాన్యం కొనం అనడంతో ఐదు ఎకరాలు బీడు ఉంచి రెండు ఎకరాల్లో వేశాడు. తీరా ప్రభుత్వం ఇప్పుడు పంట కొంటాం అనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మద్దికుంటకు చెందిన బండి నవీన్‌కు 3 ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది. రెండు బోర్లు మంచిగా పోస్తాయి. యాసంగిలో వడ్లు కొనం అని ప్రభుత్వం ప్రకటించడంతో తన భూమిలో ఇతర పంటలు పండవని బీడుగా వదిలేశాడు. తీరా ఇప్పుడు ధాన్యం కొంటుండంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సర్కార్‌ మాట విని మోసపోయానని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

రామారెడ్డి (నిజామాబాద్‌): సర్కార్‌ మాట విని యాసంగిలో వరి వేయకుండా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో పంట వర్షాలకు దెబ్బతిని నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వం మాట విని బీళ్లుగా ఉంచామని వాపోతున్నారు. యాసంగిలో వరి వేయద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక వేళ వరి సాగు చేసిన కొనుగోలు చేయమని ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు నీళ్లున్నా.. భూములను బీళ్లుగా ఉంచారు. చెరువుల కింద ఇతర పంటలు పండక పోవడంతో చాలావరకు బీడు పెట్టారు. 

కొంతమంది మాత్రం ధైర్యం చేసి వరి వేశారు. జిల్లాలో భూములు ఆరుతడి పంటలను అనుకులంగా లేకపోవడం, కోతుల బెడద, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పంటలు వేయలేదు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో వరి సాగు తగ్గింది. గతేడాది యాసంగిలో జిల్లాలో 2.47 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్‌లో 1.5లక్షల ఎకరాల్లోనే సాగైంది.  

ఉపాధి కరువు 
జిల్లాలో ఎక్కువగా బోరు బావులు, చెరువు నీళ్లు పారకంతో వ్యవసాయం చేస్తుంటారు. వడ్లు కొనమని చెప్పడంతో ఎకరం ఉన్న రైతులు బీడుగా వదిలేయగా, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 2 ఎకరాల వరకు వరి పంటను సాగు చేశారు. చాలా మంది యువ రైతులు, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఉపాధి కరువై వలస బాట పట్టారు. పనులు లేకపోవడంతో హైదరాబాద్, ముంబాయి నగరాలకు వెళ్లారు. తీరా ఇప్పుడు కొనుగోళ్లు ప్రా రంభించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చెప్పడంతోనే తాము వరి వేయలేదని.. కొనుగోలు చేస్తామని ముందే చెబితే తాము నష్టపోయేవారం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట విని పొలాలను బీళ్లుగా ఉంచిన వారికి పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. 

కేసీఆర్‌ వద్దంటేనే వేయలేదు 
వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్‌ అనడంతోనే పంట వేయలేదు. ఇప్పుడు వడ్లు కొంటామని చెప్తున్నారు. నీళ్లు ఉన్నా వరి వేయని మా పరిస్థితి ఏమిటి? వరి వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి.  
– రాములు, రైతు, గిద్ద  

పరిహారం ఇవ్వాలి 
వరి సాగు చేయవద్దని వ్యవసాయాధికారులే చెప్పారు. ఇప్పుడు వడ్లు కొంటాం అంటున్నారు. వారి మాట విన్న మేము మోసపోయాం. ప్రభుత్వం పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.  
– రాజయ్య, రైతు, గిద్ద

మరిన్ని వార్తలు