Huzurabad: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

2 Aug, 2021 02:38 IST|Sakshi

రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం 

బీసీ సామాజిక వర్గానికే హుజూరాబాద్‌ టికెట్‌ 

ఎల్‌.రమణ లేదా గెల్లు శ్రీనివాస్‌లో ఒకరికి చాన్స్‌?

సాక్షి, హైదరాబాద్‌: పది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ కోటాలో శాసన మండలికి నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌ తమిళిసైకి సిఫారసు చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం పూర్తి కాగా, ఈ స్థానానికి కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి గుర్తింపును ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం వస్తుందని భావించగా, ఏకంగా మండలికి నామినేట్‌ కావడం టీఆర్‌ఎస్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.  

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లక్ష్యంగానే.. 
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్‌ ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గత నెల 23న నియమించారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పార్టీ టికెట్‌ ఇచ్చే ఉద్దేశంతోనే కౌశిక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్‌.రమణ లేదా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌లో ఒకరు హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు