భావితరాలకు మొక్కలే బహుమతి 

2 Aug, 2020 05:05 IST|Sakshi
మంత్రి హరీశ్‌రావుకు విత్తనపు బంతులను అందజేస్తున్న వనజీవి రామయ్య

సిద్దిపేట తరహాలోనే అన్ని జిల్లాల్లో మొక్కలు నాటాలి

పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య

సాక్షి, సిద్దిపేట: ‘మన తాతలు నాటిన మొక్కలు నేటికీ పండ్లు, కాయలు ఇస్తున్నాయి. ఆ చెట్ల నీడన ఉంటున్నాం.. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం.. రాబోయే తరాలకు పండ్లు, నీడను, గాలిని ఇవ్వాలంటే ఇప్పుడు మనం కూడా మొక్కలను నాటాలి’అని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని అర్బన్‌ పార్కులో డ్రోన్ల ద్వారా విత్తనపు బంతులు చల్లే కార్యక్రమానికి రాష్ట్రఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామయ్య మాట్లాడు తూ చిన్ననాటినుంచే తనకు మొక్కలను పెంచడం అలవాటుగా మారిందన్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా మొక్కల పేర్లు పెట్టి పీల్చుకుంటున్నామని చెప్పారు.

పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రతీ రోజు దేశంలో 50 వేల హెక్టార్ల విస్తీర్ణం గల అడవులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. అడవులు అంతరిస్తే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి కరువు అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా అలవాటు చేసుకోవాలన్నారు. విత్తనపు బంతుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రకృతి సిద్ధంగా మొలకెత్తిన మొక్కలు ఎక్కువ శక్తితో పెరుగుతాయని చెప్పారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం అడవులను నరుకుతూ పోతుంటే వనజీవి రామయ్య వంటి మహనీయులు మొక్కలు నాటడమే లక్ష్యంగా  జీవించడం సంతోషకరమన్నారు. రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా