మొసళ్లు ఉన్నాయంటూ కథలు చెప్పారు.. అసలు విషయం వేరు.. బోటింగ్‌ లేనట్టేనా?

6 Mar, 2022 19:11 IST|Sakshi
పాకాలలో నిరుపయోగంగా ఉన్న బోటు

ఖానాపురం (వరంగల్‌): పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిపై ఆశలు పెంచుకుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో పాటు పోస్టల్‌ స్టాంపుపై ముద్రణకు ఎంపికైంది. అన్ని అర్హతలున్నా అభివృద్ధిలో మాత్రం అంతంతమాత్రంగానే ముందుకు సాగుతుంది పాకాల సరస్సు.  

పర్యాటకానికి వచ్చే వారిని తన అందాలతో మంత్రముగ్ధులను చేసి మరోసారి తన ఒడిలోకి వచ్చే విధంగా చేస్తుంది. కానీ అధికారుల సమన్వయ లోపం, పాలకుల పట్టింపులేని తనంతో పర్యాటకులు పెదవి విరుస్తున్న దుస్థితి నెలకొంది. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ శివారులో పాకాల సరస్సు సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభయారణ్యం.
(చదవండి: Hyderabad: డీజిల్‌ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..)

బోటింగ్‌ దృశ్యాలు (ఫైల్‌ ఫొటో)

30 ఫీట్ల నీటిసామర్థ్యం కలిగిన సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. మత్తడిపోసే సమయంలో అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి చిలుకలగుట్ట అందాలు, ఔషధవనం, బటర్‌ఫ్లై గార్డెన్‌తో పాటు అభయారణ్యంలోని వివిధ రకాల పక్షులను తలకిస్తూ ఆనందంగా గడుపుతారు. అభయారణ్యంలో ఉత్సాహంగా గడిపిన తర్వాత నీటిమధ్య ఆనందంగా గడపడానికి బోటింగ్‌కు వెళ్తుంటారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటింగ్‌కు వెళ్లి సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తుంటారు.

బోటింగ్‌ దృశ్యాలు (ఫైల్‌ ఫొటో)

ఫారెస్ట్‌ అధికారుల మోకాలడ్డు..
పాకాల పర్యాటక ప్రాంతం అటవీ  ప్రాంతం మధ్యలో ఉంటుంది. అభయారణ్యం మధ్యలో ఉండే సరస్సులో బోటింగ్‌ను అనేక సంవత్సరాలుగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదే క్రమంలో సరస్సులో బోటింగ్‌ను ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానిక ప్రజల నుంచి బోటింగ్‌పై మండల ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయి. మండల స్థాయి అధికారులు ఫారెస్ట్‌ అధికారులతో గతంలో వాగ్వాదాలకు దిగడంతో కొంత కాలం యథావిధిగా నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఫారెస్ట్‌ అధికారులు మోకాలడ్డు పెట్టడంతో 2020 అక్టోబర్‌ 7 నుంచి బోటింగ్‌ సేవలు నిలిచిపోయాయి.
(చదవండి: గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్‌ )

బోటింగ్‌ దృశ్యాలు (ఫైల్‌ ఫొటో)

ఇదేంటని పలువురు పర్యాటకులు ప్రశ్నించడంతో సరస్సులో మొసళ్లు ఉన్నాయంటూ కాలం వెళ్లదీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బోటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్‌ శాఖకు పంచాలనే నిబంధన తీసుకువచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. బోటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్‌ శాఖకు పంచితే టూరిజం శాఖకు నష్టం కలుగుతుండటంతో బోటింగ్‌ను ప్రారంభించడానికి ముందుకు రావడంలేదని పలువురు అనుకుంటున్నారు. ఇరు శాఖల సమన్వయలోపంతో పర్యాటకులు బోటింగ్‌ చేయకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు.

ఫారెస్ట్‌ అధికారులతో చర్చిస్తాం..
పాకాలలో బోటింగ్‌ విషయాన్ని ఫారెస్ట్‌ అధికారులతో త్వరలో చర్చిస్తాం. బోటింగ్‌ను తప్పకుండా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం.  
– మనోహర్, ఎండీ, టూరిజం

మరిన్ని వార్తలు