ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి 

4 Jun, 2022 04:34 IST|Sakshi
ఖమ్మంలో సైకిల్‌పై వెళ్తూ సమస్యల పరిష్కారంపై సూచనలు చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

గ్రామసభలు, పాదయాత్రలు చేపట్టిన స్థానిక ప్రజాప్రతినిధులు 

త్వరలోనే ‘57 ఏళ్ల’  పింఛన్లు: ఎర్రబెల్లి 

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సభల్లో గత నాలుగు విడతలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను చదవడంతోపాటు.. చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు.

పల్లెప్రగతి కార్యక్రమం కింద నియమించిన కమిటీలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి అభివృద్ధిపై ప్రణాళికలను సిద్ధం చేశాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

త్వరలోనే పెండింగ్‌ బిల్లులకు మోక్షం 
వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంఛనంగా ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత రాయపర్తిలో, జనగామ జిల్లా కడవెండిలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొని.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించి మాట్లాడారు. ‘‘2019 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటిదాకా స్థానిక సంస్థలకు రూ.9,560.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి.

పెండింగ్‌లో ఉన్న రూ.474 కోట్లకు సంబంధించి త్వరలో టోకెన్‌/బిల్లులు/చెక్కులను క్లియర్‌ చేస్తాం.. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించే ప్రక్రియ తుది దశకు చేరిందని.. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. 

స్థానిక ప్రజాప్రతినిధుల నిరసనలతో.. 
♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల, మామకన్ను, పడుగోనిగూడెం, ముత్తాపురం సర్పంచులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. నిధుల్లేక ఇబ్బంది పడుతున్నామంటూ వార్డు సభ్యులతో కలిసి జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. ట్రాక్టర్ల రుణం కిస్తీ, డీజిల్, బ్లీచింగ్‌ కొనుగోలు బిల్లులు రావడం లేదని వాపోయారు.

♦హనుమకొండ జిల్లా ధర్మపురంలో, వరంగల్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో, జఫర్‌ఘడ్‌ మండలం రఘునాథపల్లిలో పల్లె ప్రగతి గ్రామసభలో గ్రామస్తులు పాల్గొనకుండా నిరసన తెలిపారు. 

♦‘4వ విడత పల్లెప్రగతి పనుల నిమిత్తం రూ.8లక్షల అప్పులు తెచ్చిన. ఏడాదైనా బిల్లులు వత్తలెవ్వు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేది లేక ఉపాధి పనులకు పోతున్న. ఇప్పటికైనా బిల్లులు ఇప్పించండి సారూ’ అంటూ హనుమకొండ జిల్లా విశ్వనాథకాలనీ సర్పంచ్‌ వల్లెపు అనిత కలెక్టర్‌కు మొరపెట్టుకుంది.  

♦పల్లె ప్రగతి తొలిరోజు కార్యక్రమానికి నల్లగొండ జిల్లాలో 59 మంది సర్పంచ్‌లు హాజరుకాలేదు. పెం డింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలంలోని 37 గ్రామాలు, అనుముల మండలంలోని 11 గ్రామాలు, చండూరు మండలంలోని 11 గ్రామాల సర్పంచులు గ్రామసభలను బహిష్కరించారు. 

పట్టణ ప్రగతి తీరు ఇదీ.. 
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో నాలుగో విడత పట్టణ ప్రగతి మొదలైంది. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, కొత్త పనులపై చర్చించారు. 

♦ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి ఉదయం ఆరు గంటల నుంచే సైకిల్‌పై తిరుగుతూ.. 53, 52, 41, 37 డివిజన్లలో పర్యటించారు. 41వ డివిజన్‌ డ్రైనేజీలో పిచ్చిమొక్కలను స్వయంగా తొలగించారు. 

మరిన్ని వార్తలు