రంగారెడ్డి క్లీన్‌.. మంత్రి జిల్లా స్లీప్‌ 

4 Aug, 2020 04:13 IST|Sakshi

1,037 గ్రామాల్లో ‘పల్లెప్రగతి’పై సర్వే 

అట్టడుగున నిలిచిన వరంగల్‌ రూరల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘పల్లె ప్రగతి’లో వరంగల్‌ రూరల్‌ జిల్లా వెనుకబడింది. ఈ జిల్లా గురించి ప్రత్యేక ప్రస్తావన ఎందుకంటే.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌శాఖకు ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి. ఆ మంత్రి సొంత జిల్లా వరంగల్‌రూరల్‌. అదీ అసలు సంగతి! ‘పల్లె ప్రగతి’లోని అంశాలపై పంచాయతీరాజ్‌ శాఖ  అంతర్గత సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించింది. మొదటి ర్యాంకును రంగారెడ్డి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ములుగు, సిద్ది పేట ఉన్నాయి. చివరివరుసలో వరంగల్‌ అర్బన్, వికారాబాద్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలున్నాయి. 

మూడు నెలలకోసారి... 
ప్రతి మూడు నెలలకోసారి పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో క్లీన్‌ అండ్‌ గ్రీన్, శిథిల భవనాల కూల్చివేత, మురుగు కాల్వల్లో వ్యర్థాల తొలగింపు, చెత్త సేకరణ, వర్షపునీరు నిల్వ ఉండకుండా గుంతల పూడ్చివేత, దోమల నివారణాచర్యలను పంచాయతీలు చేపడుతున్నాయి.   వీటితోపాటు  వైకుంఠధామం, నర్సరీల నిర్వహణ, డంపింగ్‌ యార్డుల పనుల పురోగతిని కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి ఒరవడిని రోజూ కొనసాగించాలని రాష్ట్ర సర్కారు పంచాయతీలను ఆదేశించింది.

అయితే, ఈ పనులు ఎంతమేరకు అమలవుతున్నాయో తెలుసుకోవాలనుకుంది సర్కారు. అకస్మా త్తుగా గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వా లని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.    ప్రొఫార్మాను కూడా ఇచ్చింది. వీధుల పరిశీలన, మురుగు కాల్వల శుభ్రం, అంగన్‌వాడీ, పాఠశాలలు, పీహెచ్‌సీ, వీధిదీపాల పనితీరు, యాంటీ లార్వా పనులు, కోవిడ్‌–19 నివారణాచర్యల పరిశీలనకుగాను ఉన్నతాధికారులు గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 1,037 గ్రామాల్లో పర్యటించి జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు