లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ

17 Apr, 2021 16:30 IST|Sakshi
లంచం డబ్బులతో దొరికిన దృశ్యం 

రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆల్బర్ట్‌

సాక్షి, పాల్వంచ ‌: ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ శుక్రవారం పాల్వంచ ఎంపీడీఓ పి.ఆల్బర్ట్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ వరంగల్, ఖమ్మం డీఎస్పీ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం..పాండురంగాపురం గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ ఆడెపు రామలింగయ్యకు బిల్లు మంజూరు కావాల్సి ఉండగా..ఎంపీడీఓ ఆల్బర్ట్‌ రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశాడు.

గతంలోనే కొంత డబ్బు ఇచ్చానని, అయినా ఇంకా అడుగుతున్నాడని విసిగిన సదరు కాంట్రాక్టర్‌ ఈనెల 9వ తేదీన ఖమ్మం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓకు డబ్బులు ముట్టజెప్పాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన గదిలోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, ఎంపీడీఓపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, క్రాంతికుమార్‌లు పాల్గొన్నారు.

గతంలో ఇద్దరు..
రెండు సంవత్సరాల క్రితం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్వో రూ.7,000లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత మార్చి 20వ తేదీన పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ మోహన్‌ చక్రవర్తి పాండురంగాపురం గ్రామానికి చెందిన అరుణ్‌సాయికి ఓ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.3,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీడీఓనే రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. పాల్వంచలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

మరిన్ని వార్తలు