ఆస్తి లెక్క.. ఫొటో పక్కా!

1 Oct, 2020 04:53 IST|Sakshi

చకచకా ఆస్తుల గణన.. యజమాని ఫొటో కూడా సేకరణ

వ్యవసాయేతరాలకు ‘టీఎస్‌–న్యాప్‌’ యాప్‌ అందుబాటులోకి..

జిల్లాల్లో నమోదు ప్రక్రియ పరిశీలనకు రాష్ట్ర స్థాయి అధికారులు

ఆస్తుల లెక్క పూర్తయిందని కార్యదర్శుల నుంచి డిక్లరేషన్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆస్తుల నమోదులో ఇంటి యజమాని ఫొటోను కూడా సేకరించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రివిజన్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రాపర్టీలే కాకుండా.. కొత్త వాటికి కూడా ఈ ఫొటోలను సేకరించాలని తాజాగా ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి కట్టడాన్ని మదింపు చేయాలని నిర్దేశించిన పంచాయతీరాజ్‌ శాఖ.. సేకరించిన సమాచారాన్ని ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియను కూడా బుధవారం అర్ధరాత్రిలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో గ్రామ కార్యదర్శులు ఆస్తుల లెక్క తీయడంలో తలమునకలయ్యారు. మరోవైపు ఆస్తుల గణనను తీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను జిల్లాలకు పంపింది. 

కులం, ఫొటో, ఆధార్‌ ఇవ్వాల్సిందే.. 
ఈ–పంచాయతీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న సమాచారాన్ని వ్యవసాయేతర ఆస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీఎస్‌–న్యాప్‌ (తెలంగాణ వ్యవసాయేతర ఆస్తులు) యాప్‌లో నిక్షిప్తం చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. ఈ మేరకు కార్యదర్శులకు యాప్‌ లింక్‌ను పంపింది. ఇప్పటివరకు ఫోన్, ఆధార్‌ నంబర్‌ సరిపోతుందని భావించిన కార్యదర్శులు యాప్‌లో పొందుపరిచిన ప్రశ్నావళితో తలపట్టుకున్నారు. ఆస్తి యజ మాని ఫొటో, వయసు, ఆధార్, కులం, కరెంట్, నల్లా కనెక్షన్‌ నంబర్, నిర్మాణ విస్తీర్ణం, కట్టడం కేటగిరీ తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేసింది. స్థల కొలతలు సేకరించడమే గాకుండా.. ఇంటి యజమాని ఫొటోను జత చేయాలని మెలిక పెట్టింది. దీంతో కార్యదర్శులపై తీవ్ర పనిభారం పడింది. గడువు తక్కువగా ఉండటంతో సేకరించాల్సిన డేటా చాంతాడంత ఉండటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు సమాచారంలో తప్పులు దొర్లితే చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

జిల్లాలకు రాష్ట్ర స్థాయి అధికారులు.. 
వ్యవసాయేతర ఆస్తుల నమోదును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను పంచాయతీరాజ్‌ శాఖ పంపింది. ఇప్పటికే మండలాల వారీగా ఆయా జిల్లాల అధికారులను కలెక్టర్లు నియమించగా.. తాజాగా జిల్లా పరిషత్‌ సీఈవో, డిప్యూటీ సీఈవో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర స్థాయి అధికారులను కూడా జిల్లాలకు పురమాయించారు. తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నమోదు ప్రక్రియను అంచనా వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

డేటా అప్‌లోడ్‌.. సర్వర్‌ డౌన్‌ 
పెద్ద గ్రామ పంచాయతీలు మినహా చిన్న జీపీల్లో సాధ్యమైనంత వరకు బుధవారంలోగా ఆస్తుల గణన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ పెట్టింది. దీం తో డెడ్‌లైన్‌ ముగుస్తుండటంతో సేకరించిన డేటాను కార్యదర్శులు ఈ–పంచాయతీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు నమోదు ప్రక్రియకు అవరోధంగా మారాయి. ఏకకాలంలో వివరాలను నిక్షిప్తం చేస్తుండటంతో సర్వర్‌ మొరాయిస్తోంది. ఇది కూడా పంచాయతీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు ఆస్తుల గణన పూర్తయిందని డిక్లరేషన్‌ ఇవ్వాలని కొన్ని జిల్లాల డీపీవోలు కార్యదర్శులు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా