వైభవంగా పంచ కుండాత్మక యాగం 

22 Mar, 2022 02:50 IST|Sakshi
సోమవారం రాత్రి విద్యుత్‌ దీపాలంకరణలో ఆలయం వ్యూ 

యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన ఘట్టానికి అంకురార్పణ

ఉదయం స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ 

సాయంత్రం మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం 

శ్రీపంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు  

వారం రోజుల పాటు జరగనున్న యాగం 

సాక్షి, యాదాద్రి: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుత ఘడియలు రానే వచ్చాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన ఘట్టానికి సోమవారం అంకురా ర్పణ జరిగింది. యాదాద్రి ప్రధానాలయ మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా వారం రోజుల పాటు జరిగే సప్తాహ్నిక పంచ కుం డాత్మక యాగానికి ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మో హనాచార్యులు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు.

తొలిరోజు సోమవారం శ్రీస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పంచ కుండాత్మక యాగానికి ఉదయం స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణ నిర్వహించి ఆధ్యాత్మిక పర్వాలను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలో భగవత్‌ ఆజ్ఞ తీసుకున్న అనంతరం బాలాలయంలో స్వస్తి వాచనం, విష్వక్సేన పూజ, పుకాహశించనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశన, ఋట్విగ్వరణం, అఖండ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.  


పంచ కుండాత్మక యాగం పూజలు నిర్వహిస్తున్న ఆచార్యులు

గోదావరి జలాలతో స్వామి పాదాలకు అభిషేకం     
ప్రధానాలయంలో శ్రీపంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం పారాయణీకులు అత్యంత వైభవంగా వాస్తుపూజ నిర్వహించారు. అలాగే మల్లన్న సాగర్‌ నుంచి కాలువ ద్వారా జంగంపల్లికి వచ్చిన గోదావరి జలాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదాలను అభిషేకించారు.  

ఆటంకాలు కలుగకుండా విష్వక్సేన పూజ 
బాలాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచ కుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవములలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృ త్సంగ్రహణం, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన వేడుకలు నిర్వహించారు. మహా కుంభ సంప్రోక్షణ సందర్భంగా ఎలాంటి అటంకాలు కలుగకుండా ఉండేందుకు విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా, సంపూర్ణంగా కొనసాగేందుకు శ్రీ విష్వక్సేన పూజ శ్రీపంచారాత్రాగమ శాస్త్రానుసారం నిర్వహించారు.

లోకకల్యాణం కోసం స్వస్తి వాచనం 
ఆగమ శాస్త్రానుసారంగా స్వస్తి వాచన మంత్రాలతో వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ఎలాంటి బాధలు లేకుండా ప్రాణ కోటి సుఖసంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకొనే స్వస్తి వాచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి, సహాయ కార్య నిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో ఈ కార్యక్రమాల సందర్భంగా అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. కొండపైన, యాదగిరిగుట్టలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు శాంతి పాఠం..అగ్నిమథనం 
యాదాద్రి ఆలయంలో సప్తాహ్నిక పంచకుం డాత్మక యాగం, మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఉదయం శాంతి పాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుం భారాధనలు, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట, యజ్ఞ ప్రారంభం చేస్తారు. అనంతరం విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్య లఘు పూర్ణాహుతి జరిపిస్తారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం, నవకలశ స్నపనం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు