ఇది ‘తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌’

2 Sep, 2021 03:45 IST|Sakshi

పరకాలలో దేశభక్తులపై నిజాం పోలీసుల రాక్షసత్వం 

భారత యూనియన్‌లో విలీనం కోరిన ఉద్యమకారులపై పాశవిక దాడి 

పదుల సంఖ్యలో యోధుల హత్య 

1947, సెప్టెంబర్‌ 2న దారుణం.. నేటికి 74 ఏళ్లు పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: మూడు కిలోమీటర్ల భారీ మానవహారం. సమీప ఊళ్ల నుంచి పోగైన నాలుగు వేలమంది ముందుకు కదులుతున్నారు. చేతుల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా, వందేమాతరం, నిజాం వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. వారు జాతీయ పతాకాన్ని ఎగరేయాల్సిన మైదానం సమీపంలోకి రాగానే నిజాం పోలీసులు, రజాకార్లు విరుచుకుపడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు పారిపోతున్నవారిపై కత్తులతో దాడి.. చూస్తుండగానే రణరంగమైందా ప్రాంతం. 15 మంది అక్కడికక్కడే చనిపోగా, పారిపోతూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరో ఎనిమిది మంది అసువులుబాశారు. ఇది పాశవిక నిజాం సైన్యం సృష్టించిన నరమేధం.

తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో నిలిచిపోయిన రక్తపుమరక. బ్రిటిష్‌ సైన్యం దేశభక్తులపై విచక్షిణారహితంగా కాల్పులు జరిపి వందలమందిని పొట్టనపెట్టుకున్న జలియన్‌ వాలాబాగ్‌ నరమేధాన్ని పోలిన ‘తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌’ ఘటన. సొంత హవా కోసం తహతహలాడి బ్రిటిష్‌ పాలకులకు తొత్తుగా మారి జనానికి ప్రత్యక్ష నరకం చూపిన నిజాం పాలనకు ఇదో ఎర్రటి గుర్తు. అలనాటి భయంకరమైన రోజును ఇప్పటికీ మరిచిపోని ఆ ప్రాంతం పరకాల. ఘటన జరిగింది 1947 సెప్టెంబరు 2. సరిగ్గా నేటికి 74 ఏళ్లు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కచ్చితంగా గుర్తుచేసుకోవాల్సిన ఘటన ఇది.  

స్మారకం ఏదీ? 
స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందే ఈ పరకాల ఘటనకు సంబంధించి కొన్నేళ్ల క్రితం వరకు పరకాలలో కనీసం స్మారకం కూడా లేదు. అప్పట్లో చిన్నస్తూపం, చనిపోయినవారి పేర్లతో ఫలకం మాత్రం ఏర్పాటుచేశారు. కేంద్ర సహాయమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ నేత విద్యాసాగరరావు తన తల్లి పేరిట ఉన్న ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ ఓ స్మారకాన్ని నిర్మించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఆరోజు చేయిచేయి పట్టుకుని మానవహారంగా వచ్చిన అమరవీరులకు గుర్తుగా అక్కడ ర్యాలీగా వెళ్తున్నట్లుగా మనుషుల బొమ్మలు ఏర్పాటు చేయించారు.  

జలియన్‌ వాలాబాగ్‌తో పోల్చదగింది 
పంజాబ్‌లోని జలియన్‌ వాలాబాగ్‌లో దేశభక్తులపై కాల్పులు జరిపించి వందలమంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ రాక్షసత్వానికి, పరకాలలో ‘జాయిన్‌ ఇండియా’ ఉద్యమంలో రాక్షసంగా వ్యవహరించి పదుల సంఖ్యలో పోరాట యోధుల మృతికి కారణమైన నిజాం పోలీసు సీఐ జియాఉల్లా ఉన్మాదానికి పోలిక ఉంది. చరిత్రలో పరకాల మరో జలియన్‌ వాలాబాగ్‌గా నిలిచిపోయింది. కానీ చాలామందికి నాటి గాథ తెలియకపోవటం విచారకరం. ఇక్కడి స్మారకాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.  
– రాచర్ల గణపతి, చరిత్ర విశ్లేషకుడు  

మరిన్ని వార్తలు