Teachers Transfers In Telangana: పక్షవాతంతో ఉన్నా హెచ్‌ఎం బదిలీ.. మనస్తాపానికి గురై..

31 Dec, 2021 02:30 IST|Sakshi

మనస్తాపానికి గురై గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన   

సాక్షి,మహబూబాబాద్‌ రూరల్‌: ఆర్నెల్లుగా పక్షవాతంతో బాధపడుతున్నానని.. స్పౌజ్‌ కేట గిరీనీ పరిగణనలోకి తీసుకొని తనను బదిలీ చేయొద్దని కోరినప్పటికీ ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి సమీపంలో నివసించే బానోతు జైత్రాం (57) నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ఎంపీపీఎస్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు.

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో జైత్రాం తనను స్పౌజ్‌ కేటగిరీ కింద మహబూబాబాద్‌ జిల్లాలోనే ఉంచాలని ఆప్షన్‌ ఇచ్చాడు. తన భార్య పద్మ మహబూబాబాద్‌ జిల్లా సంధ్య తండాలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నందన ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు ములుగు జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులుగా బజారుకు వెళ్లగా.. దీనిపైనే మదనపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు తిరిగొచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

మరిన్ని వార్తలు