పాక్‌ సరిహద్దుల్లో ఖానాపురం వాసి  

29 Sep, 2020 05:56 IST|Sakshi

మతిస్థిమితం లేక నాలుగేళ్ల కిందట అదృశ్యం 

20 రోజుల క్రితం సైన్యం అదుపులోకి.. 

స్థానిక పోలీసులకు సమాచారం

ఖానాపురం: మతిస్థిమితం సరిగా లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరకు భారత్‌ – పాక్‌ సరిహద్దుల్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తచ్చాడుతుండగా సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పరమేశ్వర్‌కు ఎనిమిదేళ్ల క్రితం తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయాడు.  భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని తరచూ కొడుతుండటంతో వారు హైదరాబాద్‌ వలస వెళ్లారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఓ రైలు ఎక్కి వెళ్లిపోయిన పరమేశ్వర్‌.. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇరవై రోజుల క్రితం రాజస్తాన్‌లోని జింజిర్యా నీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు.

అక్కడ సరిహద్దులు దాటి పాక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మన సైనికులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అతనికి మతిస్థిమితం లేదని.. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురంవాసి అని విచారణలో తేలింది. పరమేశ్వర్‌ తెలుగులో మాట్లాడుతుండటంతో ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన సైనిక అధికారి సురేశ్‌ బాబు ఈ విషయాన్ని ఖానాపురం ఎస్సై సాయిబాబుకు ఫోన్‌ ద్వారా తెలిపారు. పరమేశ్వర్‌కు ఎలాంటి నేరచరిత్ర లేదని, మతిస్థిమితం తప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన సైనికాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పరమేశ్వర్‌ అన్నయ్య పుల్లయ్య, బంధువులు రాజస్తాన్‌ వెళ్లి అతడిని ఖానాపురం తీసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు