కన్నపేగు కన్నీరు!

4 Feb, 2023 02:13 IST|Sakshi

కన్నబిడ్డలు దూరంపెట్టడంతో అనాథలుగా అమ్మానాన్నలు 

చివరి మజిలీలో అవస్థలు, అనారోగ్యంతో ఇబ్బందులు 

పిడికెడు మెతుకుల కోసం అలమటిస్తున్న తీరు 

ఇలాంటి బతుకు వద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొందరు 

ఆవేదనతోనే జీవచ్ఛవాల్లా గడుపుతున్నవారు ఎందరో.. 

ప్రభుత్వమే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్న సామాజిక వేత్తలు 

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది.

కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. 

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. 

సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది.

తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. 

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. 
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. 

ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు 
ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. 

కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ 
ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్‌ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్‌ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్‌ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. 

ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. 
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. 

రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం 
తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

ప్రభుత్వం కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి 
చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు.

ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 
– డాక్టర్‌ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు