ఒకరు అదృశ్యం.. మరొకరు అమ్మకానికి!

2 Aug, 2021 01:37 IST|Sakshi

తల్లిదండ్రులకు ఐసీడీఎస్‌ అధికారుల కౌన్సిలింగ్‌

అయినా ససేమిరా అనడంతో డిండి పోలీసులకు ఫిర్యాదు

డిండి: కళ్లు తెరిచి నెలరోజులు గడిచిందో లేదో.. అప్పుడే అమ్మఒడి నుంచి ఓ ఆడశిశువు అదృశ్యమైంది.. దీనిపై తల్లిదండ్రులు నోరువిప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోఘటనలో ఏడురోజుల పసిగుడ్డును అమ్మకానికి పెట్టారు ఓ పేద తల్లిదండ్రులు. ఇదేమిటని ప్రశ్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాలు... డిండి మండలం కుందేలుబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామలబాయితండాకు చెందిన జర్పుల çరమేశ్, సంగీత దంపతులు. వీరికి జూన్‌ 28న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. కాన్పు అనంతరం కాటికబండతండాలోని తల్లిగారింటికి వెళ్లిన సంగీత వారం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది.

అయితే శిశువు పేరు రిజిస్టర్‌లో నమోదు చేయడానికి వెళ్లిన అంగన్‌వాడీ టీచర్‌కు ఆ శిశువు కనిపించలేదు. శిశువు గురించి అడిగితే తల్లిదండ్రుల్లో ఉలుకూపలుకూలేదు. అదే శ్యామలబాయి తండాకు చెందిన ఇస్లావత్‌ సక్రూ భార్య అమృత గతనెల 24న మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపను ఇతరులకు అమ్ముకుంటున్నారని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌ 1098కు ఓ కాల్‌ వచ్చింది. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు, డిండి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు గతనెల 30, 31 తేదీల్లో ఆ దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శిశువులు తల్లిదండ్రుల వద్దే ఉండాలని, లేనిపక్షంలో ఐసీడీఎస్‌ గృహానికి అప్పగించాలని, అక్రమంగా దత్తత ఇవ్వకూడదని సూచించారు. అయినా తమ బిడ్డను అమ్ముకుంటామని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక ఆ ఇద్దరు శిశువుల వివరాలు సేకరించాలని కోరుతూ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రేణుకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు