పల్లె పార్క్‌లకు స్థల సమస్య

8 Sep, 2020 10:42 IST|Sakshi
బాల్కొండ మండలం చిట్టాపూర్‌లో నిర్మిస్తున్న పల్లెప్రగతి వనం

సాక్షి, నిజామాబాద్‌ : నగరాలు, పట్టణాల మా దిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు స్థలాల సమస్య వెంటాడుతోంది. వీటిని ఏర్పాటు చేసేందుకు సౌకర్యవంతమైన ప్రభుత్వ భూమి గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యి. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను, సుమారు 70 గ్రామ పంచాయతీల్లో స్థలాలు అందుబా టులో లేవు. దీంతో స్థలాలు లేనిచోట్ల పనులు ప్రారంభం కావడం లేదు. ఒక్కో ప్రకృతి వనాన్ని కనీసం ఎకరం స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామానికి  మూడు కిలోమీటర్ల లోపు వీటిని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పలు గ్రామాల్లో ఎకరం విస్తీర్ణం లేకపోవడంతో అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. పనులు చేపట్టిన 460 గ్రామాల్లోని 59 గ్రామాల్లోని అటవీభూముల్లో ఈ పార్కులను నిర్మిస్తున్నారు. 401 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ, ఆబాదీభూములున్నాయి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూముల కొరత ఉండటం సాధారణం. కానీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు పల్లె ప్రకృతి వనాల విషయానికి వస్తే గ్రామాల్లో సైతం ప్రభుత్వ భూముల సమస్య తెరపైకి రావడం గమనార్హం.  

ఆర్డీవోలకు బాధ్యతలు.. 
పల్లె ప్రకృతి వనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. నిర్మాణం ప్రారంభం కాని గ్రామ పంచాయతీల్లో భూముల గుర్తింపు బాధ్యతలను కలెక్టర్‌ సి నారాయణరెడ్డి ఆర్డీవోలకు అప్పగించారు. వీలైనంత త్వరగా భూములను గుర్తించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కాని గ్రామాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే ఆ భూములను స్వాధీనం చేసుకుని పార్కుకు కేటాయిస్తారు. సమీపంలో అటవీభూములుంటే కూడా వాటిలో ఈ పార్కులను నిర్మిస్తారు. ఇవేవీ అందుబాటులో లేనిపక్షంలో గ్రామాల్లో దాతల నుంచి భూములు సేకరించాలని భావిస్తున్నారు.  

వేగంగా పనులు..
జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా సాగుతున్నాయి. స్థలాలు అప్పగించిన 460 గ్రామాల్లో వీటి నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులపై జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 గ్రామాల్లో ఈ వనాల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కాగా ఒక్కో ప్రకృతి వనాన్ని రూ.5.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల వరకు నిర్వహణ నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తున్నారు. ఈ వనాల్లో ప్రతి మూడు ఫీట్లకు ఒకటి చొప్పున మొక్కలు నాటుతున్నారు. వనం చుట్టూ ఫెన్సింగ్‌ చేస్తున్నారు. నడక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు