Union Budget 2022: హైవేల నిధులకు ‘రూట్‌’ క్లియర్‌! 

2 Feb, 2022 03:22 IST|Sakshi

రూ.7 వేల కోట్లు అందే చాన్స్‌ 

ఇందులో సగం మేర ప్రస్తుత బడ్జెట్‌.. మిగతా సగం కొత్త బడ్జెట్‌ నుంచి..  

రాష్ట్రానికి భారీగానే జాతీయ రహదారులు 

1,138 కి.మీ. రోడ్లకు సంబంధించిఅనుమతులు ఇవ్వాల్సి ఉంది.

National Highways to be expanded: రాష్ట్రంలోని కొత్త జాతీయ రహదారులకు ‘రూట్‌’క్లియర్‌ అయింది. కొన్నేళ్లుగా కేంద్రప్రభుత్వం తెలంగాణకు కొత్త జాతీయరహదారులను బాగానే కేటాయిస్తున్న విషయం తెలిసిందే, వాటి నిర్మాణానికి కూడా భారీగానే నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు పచ్చజెండా ఊపిన కేంద్రం, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన రోడ్డు పనులకు అనుమతులు మంజూరు చేసే అవకాశముంది. తాజా బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా 25 వేల కి.మీ. రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.

రూ.20 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో మన రాష్ట్రానికి రూ.3,500 కోట్ల మేర కొత్తగా నిధులు కేటాయించే అవకాశముందని ఒక అంచనా. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు సంబంధించి దాదాపు రూ.3,500 కోట్లు త్వరలో రానున్నాయి. అవి పాత బడ్జెట్‌ కిందే ఇచ్చే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్‌ కేటాయింపుల నుంచి మరో రూ.3,500 కోట్లు వస్తుండొచ్చని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7 వేల కోట్లకుపైగా విలువైన కొత్త రోడ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇచ్చిన కేంద్రం, వాటికి అనుమతులు, డీపీఆర్‌లు, పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపనుంది. మరో రెండుమూడు కొత్త రోడ్లకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది.  

అనుమతులు రావాల్సిన రోడ్లు ఇవే.. 
గత ఏడాదికాలంలో తెలంగాణ రాష్ట్రంలో  3,306 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందులో 2,168 కి.మీ. మేర రోడ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 1,138 కి.మీ. రోడ్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. వాటిల్లో రీజినల్‌ రింగురోడ్డులోని ఉత్తర భాగానికి అనుమతి రాగా, దక్షిణ భాగమైన చౌటుప్పల్‌–ఆమన్‌గల్‌–షాద్‌నగర్‌–కంది రోడ్డుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది.

ఇది దాదాపు 183 కి.మీ. మేర ఉంటుంది. ఇక కరీంనగర్‌–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారి, కొత్తకోట–గూడూరు–మంత్రాలయం, జహీరాబాద్‌–బీదర్‌–డెగ్లూర్‌ రహదారులకు సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఐఆర్‌ఎఫ్‌) నుంచి రూ.750 కోట్లు కేటాయించాల్సి ఉంది. వీటికి మరిన్ని జత చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయించే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు