డబ్బులు ఇస్తున్నాం కదా.. మోదీ ఫొటో ఎందుకు పెట్టరు!

20 Jan, 2021 03:30 IST|Sakshi

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ఎందుకు పెట్టడం లేదు

స్మార్ట్‌ సిటీ నిధులను ఎందుకు దారిమళ్లించారు

రాష్ట్ర వాటా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు

పూర్తయిన 80 వేల ఇళ్లను ఎప్పుడు లబ్ధిదారులకు కేటాయిస్తారు

రాష్ట్ర అధికారులపై పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నల వర్షం

కేంద్ర పథకాల అమలు తీరుపై అసహనం వ్యక్తం చేసిన సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం నిలదీసింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని స్పష్టం చేసింది. గ్రేటర్‌ వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి?.. ఈ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దారి మళ్లించింది?.. ఎందుకు ఆలస్యంగా విడుదల చేసింది?.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుంది?.. అని ప్రశ్నల వర్షం కురిపించింది.

లోక్‌సభ ఎంపీ జగదాంబిక పాల్‌ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ స్థాయి సంఘం మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో    కేంద్ర పట్టణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు మొత్తం రూ.1500 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎందుకు విడుదల కాలేదని స్థాయి సంఘం సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఇతర సభ్యులు తెలంగాణ అధికారులను నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.

స్మార్ట్‌ సిటీ అడ్వైజరీ కమిటీ వేశారా? మూడు నెలలకోసారి ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయా? ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు? అని అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ లేఖలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేసిన నిధులను సమానంగా రూ.392 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ బదులిచ్చినట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 80 వేలకు పైగా గృహాలను ఎందుకు లబ్ధిదారులకు కేటాయించడం లేదని సభ్యులు ప్రశ్నించగా, వీటికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు