ప్రయోగాత్మకంగా డీజిల్‌ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు

12 Feb, 2022 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చింది. అయితే ఇది కొత్త బస్సు కాదు. డీజిల్‌ భారం నుంచి బయటపడేం దుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న బస్సు. అంటే డీజిల్‌తో నడిచే బస్సును ఎలక్ట్రిక్‌ బస్సుగా మార్చారన్న మాట. ఈ బస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ డిపోకు చేరుకుంది. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్‌ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. 

ఖర్చు తగ్గింపే లక్ష్యం
ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్‌ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్‌ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్‌ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్‌ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే.

అంత వ్యయంతో ఎలక్ట్రిక్‌ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్‌) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా ఎలక్ట్రిక్‌ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్‌–2 డిపోకు చెందిన ఓ డీజిల్‌ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్‌ బస్సుగా కన్వర్ట్‌ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 

ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు!
ప్రస్తుతం కన్వర్షన్‌ ఖర్చును కూడా ఆర్టీసీ భరించలేదు. దీంతో బస్సును కన్వర్ట్‌ చేసిన తర్వాత నిర్ధారిత కాలం పాటు ఆ సంస్థే బస్సులను నిర్వహించుకుని, అద్దె వసూలు చేసుకుని, నిర్ధారిత కాలం తర్వాత బస్సులను ఆర్టీసీకి అప్పగించే విధానంపై ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని వార్తలు