యువతరం మారుతోంది

1 Mar, 2023 03:31 IST|Sakshi

చదువుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే పార్ట్‌టైమ్‌ పనులు 

కుటుంబానికి భారంగా ఉండకూడదనే ఆలోచన 

ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌గా లేదా బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉపాధి  

యువతరం ఆలోచన మారుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు వారి ఆలోచనలో మార్పు తెస్తుంటే.. అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఉపాధి అవకాశాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. హుందాగా పనిచేస్తూ కష్టాన్ని బట్టి సంపాదన పెంచుకునే అవకాశం వారిని ఆకర్షిస్తోంది. దీంతో చదువుకుంటూనే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే కుటుంబంపై ఆధారపడకుండా అవసరమైన ఖర్చుల కోసం ఆహారం, సరుకులు, వస్తువుల ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌గా, బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లుగా చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది (80 శాతం) విద్యాధికులు కావడం ఆసక్తి కలిగించే అంశం.  – సాక్షి, హైదరాబాద్‌

నగర బాట.. ఉపాధి వేట 
మొత్తం మీద విద్య కోసమో, ఉద్యోగం కోసమో లక్షలాది మంది యువత హైదరాబాద్‌ మహా నగరానికి వలస వస్తోంది. వీరిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. మొన్నటి వరకు ఇంటి నుంచి పంపించే డబ్బులను జాగ్రత్తగా వాడుకుంటూ చదువుకోవడమో, మంచి ఉద్యోగం వెతుక్కోవడ­మో చేస్తూ వచ్చారు. మారు­తున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఉపాధి అవకాశాలు అందు­బాటులోకి రావ­డంతో ఇక తల్లిదండ్రుల డబ్బులపై ఆధారపడి ఉండాలని అనుకోవడం లేదు. తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి  పార్ట్‌ టైం ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న డెలివరీ రంగం వీరికి గొప్ప అవకాశంగా మారింది.  

75 వేల మందికి పైనే.. 
మహానగరంలో 75 వేల మందికి పైగానే ఫుడ్, గ్రోసరీ డెలివరీ, బైక్‌ ట్యాక్సీ రంగంలో కొనసాగుతున్నట్లు ఆయా కంపెనీల ఆధికార గణంగాలు స్పష్టం చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, ఉబర్‌ ఈట్స్,  ఫుడ్‌పాండా, రాపిడో తదితర సంస్థలు తమ మార్కెట్‌ను విస్తరించుకోవడంలో భాగంగా యువతను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో వంటి సంస్థలు కూడా తమ సరుకులు, వస్తువుల డెలివరీకి యువతను వినియోగిస్తున్నాయి. 

పని చేయాలనే తపన ఉంటే సరి.. 
పార్ట్‌ టైం ఉద్యోగం చేయాలనే తపన, కాలం విలువ తెలిస్తే చాలు ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేయొచ్చు. కనీస విద్యార్హతతో పాటు లైసెన్స్, ద్విచక్రవాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్‌ వివరాల ఒరిజినల్స్‌తో కంపెనీలో సంపద్రిస్తే సరిపోతుంది. కస్టమర్‌కు ఆర్డర్‌ సమయానికి ఎలా అందించాలి? వారితో ఎలా నడుచుకోవాలి? ఇన్సెంటివ్స్‌ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? నగరంలో డ్రైవింగ్‌ ఎలా చేయాలి? తదితర వాటిపై సదరు కంపెనీలు శిక్షణ ఇస్తున్నాయి.

బీకాం చేస్తూనే డెలివరీ...
బీకాం కంప్యూటర్‌ ఫైనల్‌ ఇయర్‌ చేస్తూ పార్ట్‌టైంగా ఫుడ్‌ డెలివరీ బోయ్‌గా పనిచేస్తు న్నా. ప్రతిరోజు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తున్నా. కాలేజీ, ట్యూషన్‌ ఫీజులు, చేతి ఖర్చులకు సరిపోతున్నాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లిదండ్రులపై ఆధార పడకుండా సొంతంగా సమకూర్చుకుంటుండటంతో సంతృప్తిగా ఉంది. నా మిత్రు లు చాలామంది ఇలా చదువుకుంటూనే పార్ట్‌టైంగా పని చేస్తూ సంపాదిస్తున్నారు.
– మొహియొద్దీన్, ఫుడ్‌ డెలివరీ బాయ్, మల్లాపూర్‌

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే 
బీటెక్‌ పూర్తి కావడంతో అదనపు కోర్సుల కోసం నగరానికి వచ్చాను. కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఏడాది పాటు ఇంటి నుంచి డబ్బులు పంపించారు. తర్వాత కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఫ్రెండ్‌ బైక్‌తో పార్ట్‌ టైం జాబ్‌లో చేరాను. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నా.  
– వెంకటేశ్వర్లు, నల్లగొండ

డిగ్నిటీ ఆఫ్‌ వర్క్‌.. 
సిటీలో ఫుడ్, గ్రాసరీ డెలివరీ, బైక్‌ ట్యాక్సీ డిగ్నిటీ ఆఫ్‌ వర్క్‌గా మారాయి.  నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సైతం పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ సంపాదించుకుంటున్నారు.  
– షేక్‌ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 
 

>
మరిన్ని వార్తలు