Vayyari Bhama: ‘వయ్యారిభామ’కు ఎన్ని పేర్లో..! దీనితో అలర్ట్‌గా ఉండకపోతే ఆగమే..

24 Jul, 2022 20:39 IST|Sakshi

జగిత్యాల అగ్రికల్చర్‌: పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న వయ్యారి భామ మొక్కలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి మనుషుల అనారోగ్యానికి కూడా కారణమవుతున్నాయి. పార్థీనియం.. వయ్యారిభామ.. కాంగ్రెస్‌ గడ్డి.. క్యారెట్‌ గడ్డి.. నక్షత్ర గడ్డి.. ఇలా రక రకాల పేర్లతో పిలిచే ఈ మొక్కను శాశ్వతంగా నిర్మూలించాలని శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనిపిస్తున్నాయి.

1950లో మన దేశంలోకి..
1950లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలతో ఈ విత్తనం మన దేశంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే అంతటా విస్తరించింది. బంజరు, పంట భూములు, జనవాసాలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, పెట్రోల్‌ బంకులు, కాల్వలు, పొలాల గట్లపైన, బీడు భూములు, బస్‌ స్టాపులు, పాడుబడ్డ ప్రదేశాల్లో వయ్యారిభామ మొక్కలు పెరుగుతాయి. ఇది ఏకవార్షిక మొక్క. 90 నుంచి 150 సెం.మీ. ఎత్తు ఉంటుంది. ఒక్కో మొక్క 50 నుంచి 80 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది.

వైరస్‌లకు ఆశ్రయం
వయ్యారిభామ ఒక్క పంటలకే కాదు మనుషులకు, జంతువులకు ఎంతో హాని చేస్తుంది. పంటల దిగుబడిని 40 శాతం, పశుగ్రాస దిగుబడిని 90 శాతం వరకు తగ్గిస్తుంది. ఇది ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులు టమాట, మిరప, మొక్కజొన్న, వంగ పూతలపై పడినప్పుడు వాటిలో ఫలదీకరణం నిలిచిపోతుంది. కొన్ని రకాల వైరస్‌లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కల్లో వివిధ రకాల చీడపీడల వ్యాప్తికి కారణమవుతుంది. పార్థీనియం ద్వారా మనుషులకు చర్మవ్యాధులు, కళ్లు ఎర్రబడటం, జలుబు, తీవ్ర జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పీకిన వెంటనే తగులబెట్టాలి
పార్టీనియం మొక్కను పూతకు రాకముందే పీకి, వెంటనే తగులబెట్టాలి. పూతకు వచ్చిన తర్వాత చేస్తే వాటి నుంచి విత్తనాలు రాలి, మళ్లీ కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి.  

తాత్కాలిక నివారణ ఇలా..
రోడ్ల పక్కన, ఇంటి పరిసరాల్లో లీటర్‌ నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్‌ కలుపు మందును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పార్థీనియం మొక్క మొలకెత్తితే 15 నుంచి 20 రోజుల తర్వాత లీటర్‌ నీటికి 5 నుంచి 7 మి.లీ. పారాక్వాట్‌ కలిపి, పిచికారీ చేయాలి.

వర్షాలతో ఎక్కువవుతున్నాయి
ఎన్నిసార్లు దున్నినా వయ్యారిభామ మొక్కలు శాశ్వతంగా పోవడం లేదు. వర్షాలతో ఎక్కువవుతున్నాయి. రసాయన మందు పిచికారీ చేస్తే, 2, 3 నెలల్లోనే మళ్లీ పెరుగుతున్నాయి.
– ఏలేటి జలంధర్‌ రెడ్డి, ఇటిక్యాల, రాయికల్‌ మండలం

పూతకు వచ్చే ముందే దున్నేయండి
వయ్యారిభామ మొక్కలను పూత వచ్చే ముందే దున్నేయాలి. తర్వాత ఆ మొక్కలను ఏరి, కాల్చివేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేస్తే కొంత వరకు వీటిని నివారించవచ్చు.
– డాక్టర్‌ పద్మజ, వ్యవసాయ శాస్త్రవేత్త, పొలాస

మరిన్ని వార్తలు