ఆపింది.. మీరంటే మీరే..

20 Oct, 2021 04:17 IST|Sakshi
ఈటల దిష్టిబొమ్మతో దళితుల నిరసన  

‘దళితబంధు’ నిలిపివేతపై నిరసనల హోరు 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రధానపార్టీల పరస్పర ఆరోపణలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దళితబంధు పథకం నిలిపివేత రాజకీయ రగడకు దారితీసింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసే వరకు ఆ పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీల నేతలు, దళితులు ఆందోళనలకు దిగారు. పథకం నిలిచిపోవడానికి కారణం ‘మీరంటే.. మీరు’అంటూ పోటాపోటీ నిరసనలకు దిగారు.

సోమవారంరాత్రి సీఈసీ నుంచి ప్రకటన వెలువడగానే హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇటు గులాబీ శ్రేణులు, అటు కాషాయదళాలు పరస్పరం సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌–బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు.  

జమ్మికుంటలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 
జమ్మికుంట అంబేడ్కర్‌ చౌరస్తాలో కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ ఆధ్వర్యంలో ఈటలదహనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. 
జమ్మికుంట మండలం కోరపల్లిలోనూ బీజేపీ–టీఆర్‌ఎస్‌ నాయకులు దిష్టిబొమ్మ దహనాలకు యత్నించడంతో తోపులాట జరిగింది. 
వీణవంక మండలం వలబాపూర్‌ రహదారిపై  ఈటలకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్‌ వద్ద మాజీ జెడ్పీటీసీ  ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు.

జమ్మికుంటలో పోలీసులు, బీజేపీ నేతల వాగ్వాదం  

మరిన్ని వార్తలు