ఏసీ బస్సా... మేమెక్కం!

23 Nov, 2020 08:42 IST|Sakshi

కోవిడ్‌ భయంతో ప్రయాణికుల బెంబేలు

సగటున 23 శాతం ఆక్యుపెన్సీతో ఖాళీగా పరుగులు 

ఖర్చులో సగం కూడా రావట్లేదు 

అదే సమయంలో ఆర్టీసీ నాన్‌ ఏసీ బస్సుల ఓఆర్‌ 70 శాతంపైనే 

చెన్నై, మైసూరులకు ఏసీ సర్వీసులు రద్దు 

సాక్షి, హైదరాబాద్‌: ఒక్క హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం మధ్యే కాదు... దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ఏసీ బస్సుల పరిస్థితి ఇంచుమించు ఇదే.  కోవిడ్‌ భయంతో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడుతున్నారు. ఏసీలో కోవిడ్‌ వ్యాప్తి ఉంటుందని జంకుతున్నారు. దీంతో ప్రయాణికులు లేక గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులు వెలవెలబోతున్నాయి. గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 18 నుంచి 23 శాతంగా ఉండగా, రాజధాని బస్సుల్లో ఇది 30– 33 శాతం ఉంటోంది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి దూరప్రాంతాలకు తిరిగేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఏసీ బస్సులు తిప్పుతోంది.

వీటిల్లో ప్రీమియం కేటగిరీగా గరుడ, గరుడ ప్లస్‌(మల్టీ యాక్సల్‌) బస్సులు తిరుగుతున్నాయి. దాదాపు వంద వరకు ఉన్న ఈ బస్సులకు గతంలో  సగటున ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నమోదయ్యేది. వీటిలో కొన్ని సర్వీసులకైతే టికెట్లు దొరకటం గగనంగా ఉండేది. వీటి టికెట్‌ ధర అధికంగా ఉన్నందున ఖర్చుపోను కొంత ఆదాయం మిగిలి ఇవి లాభాల్లో ఉండేవి. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ బస్సుల కంటే ఎక్కువ నష్టాలు వీటితోనే నమోదవుతున్నాయి.  

ఉదాహరణకు బీహెచ్‌ఈఎల్, మియాపూర్‌ ప్రాంతాల నుంచి నిత్యం బెంగళూరుకు గరుడ ప్లస్‌ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 22 శాతమే. దాంతో ఆ బస్సుల ద్వారా కిలోమీటరుకు వచ్చే ఆదాయం (ఈపీకే) రూ.20 నుంచి రూ.23గా నమోదవుతోంది. ఇదే ప్రాంతం నుంచి విజయవాడ వెళ్లే బస్సుల్లో ఈపీకే రూ.31 ఉంటుండగా.. ఆక్యుపెన్సీ రేషియో 32 శాతంగా సగటున నమోదవుతోంది.  చదవండి:  (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!)

బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే గరుడ ప్లస్‌ బస్సుల ఈపీకే రూ.14 గా ఉంటోంది. అదే ఈ బస్సులను నడిపినందుకు సిబ్బంది జీతాలు సహా అన్ని రకాల ఖర్చులు కలిపితే కి.మీ.కు రూ.50 కంటే ఎక్కువే అవుతోంది. అంటే ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగం కూడా ఉండటం లేదు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులతో ప్రస్తుతం ఆర్టీసీకి తీవ్ర నష్టాలు నమోదవుతున్నాయి. చెన్నై, మైసూరులకు వెళ్లే బస్సుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసుకోవటం గమనార్హం.  

బాగా పుంజుకున్న నాన్‌ఏసీ బస్సులు 
ఇటీవలే అంతరరాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదర టంతో ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాకు వెళ్లే బస్సుల్లో నాన్‌ ఏసీ సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో సగటున 70 శాతాన్ని మించిపోయింది. కొన్ని రూట్లలో అంతకంటే ఎక్కువ రద్దీ కనిపిస్తోంది.  

ప్రైవేటులో ఏంటి? 
ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ ఏసీ బస్సుల్లో కూడా జనం పలుచగా కనిపిస్తున్నారు. ప్రయాణికులు లేక నష్టాలొస్తుండటంతో వాటి నిర్వాహకులు చాలా ఏసీ బస్సులను నాన్‌ఏసీ స్లీపర్‌ కోచ్‌లుగా మారుస్తున్నారు. వీటికి డిమాండ్‌ ఉండటంతో మిగతావారు ఇదే బాట పడుతున్నా రు. కానీ ఆర్టీసీ ఆ సాహసాన్ని చేయలేకపోతోంది.  

కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కండి: ఆర్టీసీ 
ప్రయాణికులు ఏసీ బస్సులంటే భయపడాల్సిన అవసరం లేదని ఆర్టీసీ పేర్కొంటోంది. మాస్కు ధరించి బస్సులెక్కొచ్చని ఆర్టీసీ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సీట్లు బుక్‌ చేసుకున్నవారికి ఫోన్‌ చేసి ప్రత్యేకంగా ధన్యవాదా లు చెబుతూ ఆకట్టుకునే ప్రయ త్నం కూడా చేస్తున్నారు. కోవిడ్‌ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ బస్సుల్లో ప్రయాణం వల్ల నష్టముండదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా