ఏసీ రైలు ఎక్కేవారేరీ? 

19 Feb, 2022 04:08 IST|Sakshi

దూరప్రాంత రైళ్లలో ఖాళీగా ఏసీ బోగీలు 

ఫ్లైట్‌ జర్నీకే ప్రాధాన్యతనిస్తున్న ప్రయాణికులు 

18 నుంచి  24 గంటలు రైళ్లలో పయనించేందుకు విముఖత 

చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా విమానాల వైపే మొగ్గు 

సామాన్యుడి చౌక ప్రయాణ సాధనం  రైలుబండికి  కొన్ని వర్గాల ప్రయాణికులు మాత్రం క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యేకంగా ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశం నలువైపులా అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి  రావడం, కేవలం  ఒకటి, రెండు గంటల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం  ఉండడంతో  విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ ట్రైన్‌ చార్జీల కంటే విమాన చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా ప్రయాణ  సమయాన్ని దృష్టిలో ఉంచుకొని  ఫ్లైట్‌ జర్నీ వైపు మళ్లుతున్నారు.      
– సాక్షి, సిటీబ్యూరో 

మారిన ప్రయాణికుల ధోరణి కారణంగా..పండుగలు, వరుస సెలవులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్‌ విమానాలు 80 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రైళ్లలో ఖాళీగా ఏసీ బెర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని సువిధ  రైళ్లలో  విమానాల తరహాలో చార్జీలను పెంచుతున్నారు.కానీ పెద్దగా ఆదరణ కనిపించడం లేదు.

ఇంచుమించు  అదే చార్జీల్లో ఫ్లైట్‌ టిక్కెట్‌ వచ్చేస్తుంది. పైగా కొన్ని ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఏజెన్సీలు  ప్రయాణికులకు  రకరకాల ఆఫర్లను  అందజేస్తున్నాయి. దీంతో చాలా మంది  విమాన ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు  అభిప్రాయపడ్డారు.

ఎక్కువ సమయమే కారణమా... 
హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, విశాఖ, తిరుపతి, భువనేశ్వర్, పటా్న, ధానాపూర్, తదితర  ప్రాంతాలకు రాకపోకలు సాగించే  రైళ్లు  12  గంటల నుంచి  18 గంటల వరకు ప్రయాణం చేస్తాయి. ఇప్పటికీ చాలా రైళ్లు గంటకు  80 నుంచి 120 కిలోమీటర్‌ల వేగంతోనే నడస్తున్నాయి.కొన్ని రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు పట్టాల సామర్ధ్య పెంపునకు చర్యలు చేపట్టారు. కానీ పెద్దగా రైళ్ల  వేగం పెరగలేదు. దీంతో  రూ.2500 నుంచి  సుమారు రూ.4000 వరకు చార్జీలు చెల్లించి  గంటల తరబడి ప్రయాణం చేసేందుకు  చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు.

అత్యవసర  ప్రయాణాలు చేయవలసిన వాళ్లు ఫ్లైట్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ‘ఇంటిల్లిపాది వెళ్లవలసినప్పుడు  ట్రైన్‌లోనే వెళ్తున్నాం. కానీ ఒక్కరు, ఇద్దరు వెళ్లవలసినప్పుడు మాత్రం ఫ్లైట్‌లోనే వెళ్తున్నాం.’ అని హైటెక్‌సిటీకి చెందిన కృష్ణ తెలిపారు. తాము  తరచుగా హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నగరం నుంచి తిరుపతి, వైజాగ్‌ వంటి  ప్రాంతాలకు ప్రతి రోజు 5 నుంచి 10 వరకు విమానాలు నడుస్తుండగా ముంబ యి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ నగరాలకు  హైదరాబాద్‌ మీదుగా 15 నుంచి 20 ఫ్లైట్‌లు అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు  తెలిపారు.  

చలో ఎయిర్‌టూర్‌... 
మరోవైపు ఐఆర్‌సీటీసీ, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  వంటి  ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌  ఆపరేటర్లు ఏర్పాటు చేసే ఎయిర్‌ టూర్‌లకు సైతం ప్రాధాన్యం పెరిగింది. ప్రతి  సంవత్సరం  ఉత్తర, దక్షిణభారత యాత్రలు నిర్వహించే  ఐఆర్‌సీటీసీ రైళ్లతో పాటు  విమాన సర్వీసుల్లోనూ  ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది . జైపూర్, శ్రీనగర్, తదితర ప్రాంతాలకు ఎయిర్‌టూర్‌లు ఉన్నాయి. 

ఏసీ బెర్తులు ఖాళీ... 
♦ హైదరాబాద్‌ నుంచి పలు మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లలో ఈ నెల  23వ తేదీన  ఏసీ  బెర్తులు  కిందివిధంగా అందుబాటులో ఉన్నాయి.  

♦ హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 23వ తేదీన ఫస్ట్‌ ఏసీలో 8 బెర్తులు, సెకెండ్‌ ఏసీలో 15, థర్డ్‌ ఏసీలో ఏకంగా 101 బెర్తులు  ఖాళీగా ఉన్నాయి.  

♦ హైదరాబాద్‌ నుంచి  న్యూఢిల్లీకి  ఫస్ట్‌ ఏసీ చార్జీ రూ.4460, సెకెండ్‌ ఏసీ చార్జీ రూ.2625 ఉంది. ఈ చార్జీలకు  కొద్దిగా అటు ఇటుగా విమానచార్జీలు ఉన్నాయి.  

♦ హైదరాబాద్‌ నుంచి చెన్నైకి  వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో  ఈ నెల 23వ తేదీన సెకెండ్‌ ఏసీలో 99, థర్డ్‌ ఏసీలో 226 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు ఫస్ట్‌ ఏసీ  చార్జీ రూ.2760, సెకెండ్‌ ఏసీ రూ.1645 చొప్పున ఉంది.   

మరిన్ని వార్తలు