కొత్త కానిస్టేబుళ్లు వచ్చేస్తున్నారు!

22 Jul, 2021 02:17 IST|Sakshi

నేడు టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్ల పీవోపీ 

12 బెటాలియన్లలో పూర్తయిన ఏర్పాట్లు  

జోరువానలోనూ ముమ్మరంగా సాధన 

24 నుంచే అపాయింట్‌మెంట్లు..

28న విధుల్లోకి 3,804 మంది

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్పీ) కానిస్టేబుళ్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 12 బెటాలియన్లలో 3,804 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. దాదాపు అన్ని కేంద్రాల్లో గురువారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాత్రం 23, 24వ తేదీల్లో చేపట్టనున్నారు. గత వారం రోజులుగా పీవోపీ కోసం ట్రైనీ కానిస్టేబుళ్లు శ్రమిస్తున్నారు. నాలుగు రోజులుగా వానలు కురుస్తున్నా ఏ రోజూ సాధన ఆపలేదు. 25వ తేదీ నుంచి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలని తొలుత ఉన్నతాధికారులు భావించారు.

అయితే ఒక్కరోజు ముందుగా 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచే అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలని బుధవారం తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. వీరు 28వ తేదీన అలాట్‌ చేసిన యూనిట్లలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొండాపూర్‌లో జరిగే పీవోపీకి హోం మంత్రి మహమూద్‌æ అలీ, టీఎస్‌ఎస్పీ ఏడీజీ అభిలాష్‌ బిస్త్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీచుపల్లి బెటాలియన్‌లో జరిగే పీవోపీకి గ్రేహౌండ్స్‌ ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారు. కాగా, 19 నెలల పాటు కానిస్టేబుళ్లకు శిక్షణ జరుగుతూనే ఉంది. మొత్తం 3,993 మంది టీఎస్‌ఎస్పీ శిక్షణకు ఎంపిక కాగా, 155 మంది రిపోర్టు చేయలేదు. వేరే కారణాలతో మరో 34 మంది శిక్షణ నుంచి తప్పుకొన్నారు. 

విజయవంతంగా ముగిసింది
గతేడాది మా వద్ద ఏఆర్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభించగానే కరోనా విజృంభించింది. అన్ని బెటాలియన్లలో పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాం. ట్రైనీల ఆహారం నుంచి పడుకునే బెడ్, దుస్తులు, క్యాంపస్‌లోకి వచ్చి పోయే సిబ్బందికి నిరంతరం పకడ్బందీగా స్క్రీనింగ్‌ చేశాం. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మా సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిపి 14 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చింది. ట్రైనీలకు వ్యాక్సినేషన్, సీనియర్‌ పోలీస్‌ అధికారులతో అనేక అంశాలపై ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. 19 నెలల పాటు నిర్వహించిన శిక్షణ విజయవంతంగా ముగిసింది.     – అభిలాష బిస్త్, ఏడీజీ  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు