పటాన్‌చెరు ప్రాంతంలో1,200 ఏళ్లనాటి జైన విగ్రహం మాయం 

11 Mar, 2021 19:46 IST|Sakshi

విశ్రాంత పురావస్తు అధికారి  పరిశీలనలో వెలుగులోకి వచ్చిన వైనం

స్టేట్‌ మ్యూజియంకు కూడా చేరలేదని తేల్చిన అధికారులు

రాష్ట్రకూటుల కాలంలో ఏర్పాటైన ధ్యానముద్ర శిల్పం

ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహం జైన మహావీరుడిది. నల్ల గ్రానైట్‌తో నిగనిగ మెరిసిపోతున్న దీని వయస్సు 1,200 ఏళ్లు. ఇది పటాన్‌చెరు ప్రాంతంలోనిది. రాష్ట్రకూటుల కాలంలో ప్రతిష్టితమైంది. దీని ఎత్తు నాలుగున్నర అడుగులు. అయితే, ఈ విగ్రహం ఇటీవల ఉన్నట్టుండి మాయమైంది. అంతర్జాతీయ విపణిలో అత్యంత విలువైన ఈ విగ్రహం అదృశ్యమవడం ఇప్పుడు హెరిటేజ్‌ తెలంగాణలో అలజడి రేపుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: పటాన్‌చెరు రాష్ట్రకూటుల పాలనకు సంబంధించిన కీలక ప్రాంతం. అప్పట్లో ఈ ప్రాంతం జైనుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగానూ విలసిల్లింది. అయితే, ఇక్కడ పలు జైన కట్టడాలు ప్రస్తుతం జీర్ణావస్థలో దర్శనమిస్తున్నాయి. ధ్యానముద్రలో ఉన్న మహావీరుడి విగ్రహం రోడ్డు పక్కన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఈ ప్రాంతం గుండా వెళ్లేవారు ఆసక్తితో తిలకిస్తూ ఉండేవారు.  

ఆలస్యంగా వెలుగులోకి.. 
గతంలో ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖలో పనిచేసి రిటైర్‌ అయిన ఈమని శివనాగిరెడ్డి తాజాగా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆయన సర్వీసులో ఉన్న సమయంలో ఇక్కడి విగ్రహాలు, ఇతర కట్టడాలపై అధ్యయనం చేసి ఉన్నారు. దీంతో వాటిని చూడాలన్న ఆసక్తితో ఇటీవల పటాన్‌చెరు వెళ్లారు. అక్కడ జైనుడి విగ్రహం కనిపించలేదు.  ఓ బుద్ధుడి విగ్రహం కనిపించింది. ధ్యానముద్రలో ఉన్న ఈ తథాగతుడి విగ్రహం ఏడాదిన్నర క్రితం పటాన్‌చెరులో ఏర్పాటైంది. స్థానికులను విచారించగా ఇటీవలి వరకు జైనవిగ్రహం రోడ్డు పక్కనే ఉండేదని, దాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని పేర్కొన్నారు. ఆయన హెరిటేజ్‌ తెలంగాణ అధికారులను సంప్రదించగా తాము దాన్ని తరలించలేదన్నారు.

గతంలో పటాన్‌చెరు నుంచి కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి స్టేట్‌ మ్యూజియంలో భద్రపరిచారు. వాటిల్లోనూ ఈ విగ్రహం కనిపించలేదు. దాన్ని ఎవరు తరలించుకుపోయారో గుర్తిస్తామని హెరిటేజ్‌ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ రాములు నాయక్‌ చెప్పారు. చాలా ప్రాంతాల్లో జైన నిర్మాణాలు, విగ్రహాలు ఆలనాపాలనా లేక పడి ఉన్నాయి. విగ్రహాలను చూసి ఆవేదన చెందే కొందరు జైన భక్తులు వాటిని తాము పరిరక్షిస్తామని, ప్రదర్శనకు ఏర్పాటు చేస్తామని పురావస్తు శాఖను అప్పుడప్పుడూ సంప్రదిస్తుంటారు. కానీ, ఈ విగ్రహం విషయంలో ఎవరూ సంప్రదించలేదని అధికారులు చెబుతున్నారు.  

స్మగ్లర్ల చేతికి చిక్కద్దనే.. 
పురాతన కాలం నాటి రాతి విగ్రహాలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. వాటిని కొందరు స్మగ్లర్లు విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటివారి చేతుల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో ఎలాంటి పురాతన సంపద అయినా రాష్ట్రప్రభుత్వం ఆస్తిగా మాత్రమే ఉండాలనే నిబంధనను అధికారులు విధించారు.   

చట్టం ఏం చెబుతోంది.. 
రాష్ట్రంలోని ప్రతి పురాతన నిర్మాణం, విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా ఇటీవలే కొత్తగా అమలులోకి వచ్చిన తెలంగాణ హెరిటేజ్‌ చట్టం చెబుతోంది. భూమిలో పది సెంటీమీటర్ల లోపల దొరికే ప్రతి పురావస్తు వస్తువు, సంపద ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిర్మాణాలు, విగ్రహాలున్నా.. కొన్నింటిని మాత్రమే రక్షిత కట్టడాలుగా గుర్తించి ప్రభుత్వం సంరక్షిస్తోంది. అయినా మిగతావాటిపై అజమాయిషీ మాత్రం ప్రభుత్వానిదే. ఎక్కడైనా విలువైన విగ్రహాలు, వస్తుసంపద వెలుగుచూస్తే స్థానికుల అనుమతితో వాటిని ప్రదర్శనశాలకు తరలిస్తారు.

స్థానికులు ఒప్పుకోని పక్షంలో అక్కడే ఉంచి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటారు. వాటికి భద్రత లేని పక్షంలో ఎవరైనా ముందుకొచ్చి సంరక్షణకు చర్యలు తీసుకుంటామంటే నిబంధనల ప్రకారం మాత్రమే వారికి అప్పగిస్తారు. కానీ పటాన్‌చెరులోని విగ్రహాన్ని ఎవరో హెరిటేజ్‌ తెలంగాణ శాఖ అధికారుల అనుమతి లేకుండా తరలించుకుపోయారని స్పష్టమవుతోంది. జైన వర్గానికి చెందిన వారు తీసుకెళ్లి సంరక్షిస్తున్నా.. .అనుమతి లేకుండా తీసుకుపోవటం మాత్రం నిబంధనలకు విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. కానీ విగ్రహం ఎక్కడుందనే విషయంలో మాత్రం సమాచారం లేక వారు దాన్ని వెదికే పనిలో పడ్డారు.   

మరిన్ని వార్తలు