ఫోర్జరీ చేసి రూ. 5కోట్ల భూ విక్రయానికి యత్నం

2 Apr, 2021 14:03 IST|Sakshi

అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది

జిన్నారం(పటాన్‌చెరు): ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చి అమ్మేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్‌ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. నకిలీ పట్టా పాసు పుస్తకాలను సృష్టించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూమి పట్టా కాదని, ప్రభుత్వ భూమి అని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీనగర్‌ గ్రామ పరిధిలోని 27 సర్వే నంబర్‌గల 1.23 ఎకరాల ప్రభుత్వ భూమిని భూపంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన ర్యాకం సుశీలకు గతంలో కేటాయించారు. 2005లో ఈ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

కాగా గాగిల్లాపూర్‌ గ్రామానికి చెందిన శివశంకర్‌యాదవ్‌ అనే వ్యక్తి ర్యాకం సుశీల నుంచి 1.23 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలను తయారు చేశాడు. 2018లో తహసీల్దార్‌గా ఇక్కడ విధులు నిర్వహించిన శివకుమార్‌ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పాసుపుస్తకాలను సృష్టించాడు. ఈ భూమిని విక్రయించేందుకు శివశంకర్‌యాదవ్‌ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక్కడ ఎకరం స్థలం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని విక్రయించి డబ్బులు సంపాదించొచ్చని భావించాడు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తహసీల్దార్‌ దశరథ్‌ ఆదేశాల మేరకు గురువారం ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతారు.

ఈ సందర్భంగా తహసీల్దార్‌ దశరథ్‌ మాట్లాడుతూ శివశంకర్‌యాదవ్‌ అనే వ్యక్తి అప్పటి తహసీల్దార్‌ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించాడని స్పష్టం చేశారు. బొల్లారం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు