ఆస్పత్రులేనా?ఎలుకల ఘటనతోనైనా మార్పు వచ్చేనా?

3 Apr, 2022 07:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌/గాంధీఆస్పత్రి: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకల దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏకంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన వైనం ప్రభుత్వాస్పత్రుల్లో డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. రోగుల భద్రతను ప్రశ్నార్థకంలో పడేసింది. అంతా బాగానే ఉందంటున్న వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపేలా చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని సర్కారు దవాఖానాలపై వైద్యశాఖ దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పింది. నగరంలోని ఆస్పత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఉస్మానియాలో వానర విహారం.. 
నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో చాలా కాలంగా కోతుల సందడి కొనసాగుతోంది. అవుట్‌ పేషెంట్‌ రోగులు వేచి చూసే ప్రాంతాల దగ్గర నుంచి అనేక చోట్ల కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇప్పటి వరకూ ఇవి ఎవరినీ తీవ్రంగా గాయపరిచిన ఘటన జరగనప్పటికీ, వీటి విషయంలో పలువురు రోగులు ఇబ్బందులు పతున్నారు. ఇదే ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్‌ విభాగంలో పిల్లులు వీర విహారం చేసేవి. రోగుల మంచాల కింద గందరగోళం సృష్టించేవి. ఇటీవల పాత ఇన్‌పేషెంట్‌ విభాగం మూసేశారు. అయినప్పటికీ అక్కడక్కడా పిల్లులు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల హల్‌చల్‌ కూడా   తక్కువేమీ కాదు. 

పేట్లబురుజులో బొద్దింకలు..  
పాతబస్తీలోని పేట్ల బురుజులో ఉన్న ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎంతో కాలంగా ఈ ఆస్పత్రిలో బొద్దింకల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ..ఏ విధమైన నిర్మూలనా చర్యలు చేపట్టలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూసీనది పక్కగానే ఉండడం వల్ల దోమలు సైతం విపరీతంగా ఉ న్నాయి. దీంతో రోగుల్లో ఆందోళన పెరుగుతోంది. తెలంగాణ వైద్యప్రదాయినీ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శునకాలు, సెల్లార్‌లోని డైట్‌క్యాంటిన్‌ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి.

ఆస్పత్రి ప్రాంగణంతోపాటు వార్డుల్లోనూ శునకాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగి సహాయకులతోపాటు వచ్చిన శునకాలకు సమృద్ధిగా ఆహారం దొరకడంతో ఆస్పత్రి ప్రధాన భవనం, ఓపీ, అత్యవసర, మార్చురీలతోపాటు  గాంధీ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని పదుల సంఖ్యలో తిష్టవేశాయి.  పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద శునకాలు నిత్యం తిష్ట వేయడం గమనార్హం. రోగులు, వైద్యులకు ఆహారాన్ని అందించే సెల్లార్‌లో కొనసాగుతున్న డైట్‌క్యాంటిన్‌ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాలు, కూరగాయలు, పప్పులు వంటి ఆహార పదార్థాలపై తిరుగుతుంటాయి. ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో సెల్లార్‌లోని బొరియలు, గుంతల్లో వందలాది ఎలుకలు, పందికొక్కులు నివసిస్తున్నాయి. 

(చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌)

మరిన్ని వార్తలు