ఆస్పత్రిలో నరకయాతన; టార్చిలైటు వెలుతురులో డెలివరీ

11 Jul, 2021 13:49 IST|Sakshi
నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌ టార్చిలైటు వెలుతురులో సేవలు..

ప్రభుత్వ ఆస్పత్రిలో తరచూ విద్యుత్‌ అంతరాయం 

నిరుపయోగంగా ఇన్‌వర్టర్లు 

రోగుల బంధువుల ఆగ్రహం 

పట్టించుకోని వైద్యాధికారులు 

మణికొండ: ప్రభుత్వ ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దుతాం.. ప్రైవేటుకు దీటుగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం.. ఇవీ ప్రభుత్వ పెద్దల ఊకదంపుడు ఉపన్యాసాలు.. వాస్తవానికి వచ్చే సరికి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర రాజధానికి ఆనుకునే ఉన్న గండిపేట మండలం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో చీకట్లోనే డెలివరీ(కాన్పులు)లు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యుత్‌ సరఫరాకు అంతారాయం కలిగితే తక్షణ అవసరంగా ఏర్పాటు చేసిన ఇన్‌వర్టర్లు మరమ్మతులకు గురికావటంతో దాన్ని పట్టించుకోవటం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో డెలివరీల కోసం వస్తున్న మహిళలు గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో నరకయాతన అనుభవిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి రోజుల వయసు ఉన్న పిల్లలు సైతం ఉక్కపోతను భరించలేక తీవ్రంగా ఏడుస్తున్నారు.  

ఇన్‌వర్టర్‌ మరమ్మతులకు అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవటంతోనే దాన్ని పక్కన పడేసినట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. శనివారం డెలివరీ నిమిత్తం వచ్చిన ఓ మహిళ బంధువులు సెల్‌ఫోన్‌ టార్చిలైటు వెలుతురులో డెలివరీ చేస్తున్న సిబ్బంది ఫొటోలను తీసి స్థానిక విలేకరులకు పంపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ రాష్ట్ర రాజధాని పక్కనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు వాపోయారు.  

మరమ్మతులు చేయిస్తాం 
గతంలో ఇన్‌వర్టర్‌ను మరమ్మతు చేయించినా తిరిగి అదే పరిస్థితికి వచ్చింది. మరమ్మతులకు సంబంధించిన నిధులు రావటం లేదు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినపుడు మహిళలు ఇబ్బంది పడుతున్న విసయం వాస్తవమే. వెంటనే తన సొంత డబ్బుతోనైనా మరమ్మతులు చేయిస్తా. 
–  పద్మ, మండల వైద్యాధికారి, గండిపేట మండలం 

మరిన్ని వార్తలు