డిస్కంలకు షాక్.. రూ.1,550 కోట్లు కట్టాలని ఆదేశం

3 Oct, 2022 11:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) షాక్‌ ఇచి్చంది. సౌర విద్యుత్‌ విక్రేత కంపెనీలకు రూ. 1,550 కోట్లకుపైగా బకాయిలను 45 రోజుల్లో చెల్లించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌/టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌)లను వేర్వేరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇప్పటివరకు బకాయిపడిన మొత్తం బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. సౌర విద్యుత్‌ కంపెనీలతో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం ఇకపై ఎప్పటికప్పుడు వాటికి చెల్లింపులు జరపాలని ఆదేశించింది.

నెలలు, ఏళ్లు గడుస్తున్నా డిస్కంలు బిల్లులు చెల్లించకపోవడంతో పలు కంపెనీలు ఈఆర్సీని ఆశ్రయించి తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలతో ఏకీభవించిన ఈఆర్సీ.. ఆయా కంపెనీలకు 45 రోజుల్లోగా మొత్తం బకాయిలను అపరాధ రుసుం (లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ)తో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేవాంగరే షుగర్‌ కంపెనీ కేసులో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్రి్టసిటీ (ఏపీటెల్‌) 2009లో జారీ చేసిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకుంది. సకాలంలో బకాయిలను చెల్లించకపోవడం పీపీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలను చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా అరుదని డిస్కంల అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కొండలా పెరిగిపోయిన బకాయిలు... 
రాష్ట్ర డిస్కంలు దాదాపుగా 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సౌర విద్యుత్‌ కేంద్రాల డెవలపర్లతో గత ఐదారేళ్ల కింద ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలు సౌర విద్యుత్‌ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతున్నాయి.

రెండు, మూడేళ్ల నాటి బిల్లులను సైతం కొన్ని కంపెనీలకు బకాయిపడటంతో వాటిపై అపరాద రుసుం భారీగా పెరిగిపోతోంది. అసలు బిల్లులు, అపరాద రుసుములు కలిపి మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోవడంతో డిస్కంలు సతమతమవుతున్నాయి. బకాయిల కోసం పలు సౌర విద్యుత్‌ కంపెనీలు కేంద్ర విద్యు­త్‌ శాఖకు ఫిర్యాదు సైతం చేశాయి. ఈ నేపథ్యంలోనే పవర్‌ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రం విద్యుత్‌ కొనుగోళ్లు జరపకుండా కేంద్రం ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంపై నిషేధం విధించింది. తాజాగా ఈఆర్సీ సైతం 45 రోజుల్లోగా మొత్తం బకాయిలు క్లియర్‌ చేయాలని ఆదేశించడం గమనార్హం.
చదవండి: వీఆర్‌ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు?

మరిన్ని వార్తలు