ఓజోన్‌ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి 

14 Feb, 2022 04:31 IST|Sakshi

గ్రేటర్‌లో పెరుగుతున్న భూస్థాయి ఓజోన్‌ మోతాదు 

ట్రాఫిక్‌ రద్దీ సమయంలోనే అత్యధికం 

ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు 

పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాల  పొగ కారణంగా భూస్థాయి ఓజోన్‌ మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ట్రాఫిక్‌ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో.. ప్రధానంగా ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిణామంతో నగరవాసులు అస్తమా, బ్రాంకైటిస్‌ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  

ఊపిరాడక సతమతం.. 
వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్‌ వాయువులు.. గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్స్, ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌లతో కలియడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్‌ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు.

సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 నుంచి 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడం గమనార్హం.  

ఓజోన్‌తో నష్టాలివే.. 
♦శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. చికాకు, అసహనం, శ్వా స తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి హేతువవుతోంది.మోతా దు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. 

♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్త మా, క్రానిక్‌ బ్రాంకైటిస్, సైనస్‌ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం  వాయుకాలుష్యమే.  

ఉపశమనం ఇలా.. 
♦ ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో  కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.   

♦ కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. గ్రేటర్‌ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతి వాహనానికీ ఏటా పొల్యూషన్‌ చెక్‌ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి.  

మరిన్ని వార్తలు